
- కూలీలకు కూడా ఖర్చులు రాని వైనం
ప్రజాశక్తి-గోనెగండ్ల : మండలంలో టమాట సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. కష్టపడి పంటను సాగు చేసి కంటికి రెప్పలా కాపాడుకుని పంటను అమ్మేందుకు మార్కెట్ కు తీసుకొని వెళితే టమోటా కోత కోసిన కూలీల ఖర్చులకు కూడా డబ్బులు రాక రైతులు దిగాలు పడుతున్నారు. దీంతో కూలి ఖర్చులు కూడా రాని పంటను మార్కెట్కు తీసుకుని వెళ్లడం దండగ అని కొందరు రైతులు పంటను పశువులకు పారబోస్తున్నారు. గిట్టుబాటు ధరలు లేక పండించిన పంటను పశువులకు పారబోస్తున్నా పట్టించుకోరా అని అధికారులు పాలకులపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గోనెగండ్ల ఎమ్మిగనూరు ఆస్పరి దేవనకొండ కోడుమూరు, పత్తికొండ తదితర ప్రాంతాల్లో టమోటా పంటను అధికంగా సాగు చేస్తారు. సాధారణ విస్తీర్ణం1478 హెక్టార్లు ఉండగా ఈ సంవత్సరం కొంత అధికంగా ఇప్పటివరకు 2250 హెక్టార్లలో టమోటాపంట సాగు చేశారు.
- 20 కిలోల టమోటా బాక్స్ ధర 100 రూపాయలు
టమోటా పంట కోత తీసి అమ్మడానికి మార్కెట్ కు తీసుకొని వెళితే20కేజీల టమోటా పెట్టె ధర ప్రస్తుతం 100 నుంచి120 రూపాయల మధ్యలో పలుకుతోంది. సాధారణంగా పెట్టె టమోటా ధర 400 రూపాయలు ఉంటే కనీసం రైతుకు గిట్టుబాటు అవుతుంది.టమోటాబాక్సు ధర అత్యధికంగా గతంలో 2400 రూపాయలు పలికింది.
- ఎర్రక్క టమోటా రైతు, గోనెగండ్ల
ఒక ఎకరా విస్తీర్ణంలో 70 వేలు ఖర్చు పెట్టి టమోటా పంట వేశాము.ఇప్పటి వరకు రెండు,మూడు కోతల ద్వారా పంటను మార్కెట్కు తీసుకొని వెళ్లి విక్రయిస్తే 10,000 కూడా చేతికి రాలేదు. గతంలో కురిసిన వర్షం తేమ వాతావరణం వల్ల పంట దెబ్బతింది.పెట్టిన పెట్టుబడికి కూడా డబ్బులు రాకపోతే ఏమి చేయాలో తెలియడం లేదు.
- గొల్ల చిన్న నాగరాజు, గోనెగండ్ల
ఒక ఎకరా టమోటా పంట వేసి సుమారు 50 వేల రూపాయలు పెట్టుబడి ఖర్చు చేశాను.కాపు మంచి దశలోఉండి దిగుబడులు బాగానే వస్తున్నాయి.ధర మాత్రం 22 కిలోల బాక్సు మార్కెట్లో 100 నుంచి 120 రూపాయల మధ్యన పలుకుతుంది.పంట కోసిన కూలీలు ఆటో రవాణా చార్జీలు కూడా రావడం లేదు.