Dec 18,2022 12:26

వెళ్లి రండి
నేను ఊరికి
ఏమిచ్చి ఉంటాను ?
నా చిన్నప్పటి చిలిపితనాన్ని,
దాని తాలూకు
ఓ నాలుగు జ్ఞాపకాలని తప్ప
తలకిందులుగా వేలాడే
గబ్బిలం లాంటి నగర జీవితంలో
కొద్ది కొద్దిగా
నాలోని మనిషిని మాయం చేసే
కొత్తందనాల ఊపిరాడని బతుకు..
దుఃఖ సముద్రాన్ని మోస్తూ..
గొప్ప ఆనందంగా భ్రమిస్తూ..
ఒకానొక సొరంగాన్ని తవ్వుకుంటూ ..
అపార్ట్మెంట్‌ బతుకు -
వెలుతురు రాని
గాలాడని
ఉక్కిరి బిక్కిరి బతుకు
నగరం ఊడల మర్రికి
వేలాడుతున్న
ఉరివేయబడ్డ శవాన్ని నేనే -
ఇదొక విలాస స్మశానం -
పిశాచాల విశాల సౌందర్యం

ఎంత భద్రంగా దాచుకుందో..
పొత్తిళ్లలో పొదుగుకున్న అమ్మలా
ఊరెళ్లగానే..
ఒక్కో జ్ఞాపకాన్ని
జొన్న పొత్తుల్లా ఒలిచి
గడ్డ కట్టిన జీవితాన్ని
అందమైన సూర్యరశ్మితో
శుభ్రపరుస్తుంది
నేను ప్రవహించే
సెలయేరైపోతాను
ఎవరిని చూసినా
పైరగాలికి ఊగే పంట చేలల్లే..
నవ్వుతూ కనిపిస్తారు
చూస్తేనే చాలు
వారు నన్ను ఆత్మీయంగా
హత్తుకున్నట్టే ఉంటుంది
బర్రె దూడ
పాలు తాగుతున్న ఆనందం
చెంగుచెంగున దుముకుతుంది
ఊరు నాకు చాలా ఇస్తుంది
నేను ఈ నేలన పుట్టినందుకు
కతజ్ఞతగా..
ఏమీ ఇవ్వకుండానే
ఎన్నో ఇస్తుంది
నేను ఏమిచ్చి ఉంటాను?
అమ్మను అనాధ శరణాలయానికి
అప్పజెప్పినట్టు
అలా వెళ్ళిపోయాను
అప్పుడప్పుడు
మీరు కూడా మీ ఊరికి వెళ్లి రండి
కొద్ది కొద్దిగా మీరు
మనుషులుగా మారుతారు
పచ్చిపాల నురగలా
ఉప్పొంగుతారు
పచ్చిపేడ గొబ్బెమ్మలా
ఒదిగిపోతారు
మరచిపోయిన జీవితాన్ని
మారిపోయిన నీవైనాన్ని
తాటితే
చందమామ తీగలుగా
గుర్తుచేస్తుంది
నీ బాల్యాన్ని నీకు
పదిలంగా ఇవ్వగలిగేది
మీ ఊరు ఒక్కటే సుమా!
అక్కడ మీ వేర్లు ఎంత బలంగా ఉంటే
మీరంతగా చిగురిస్తారు
అనుబంధపు పూల తోటల
పరిమళాల్ని ఆస్వాదిస్తారు
బొడ్డు పేగు బంధమేదో..
మట్టి వాసన అల్లుకుంటుంది
నువ్వు చనిపోయాక
పాతి పెట్టడానికి మాత్రమే
మిగిలి ఉన్న స్మశానంగా
చూడకండి మిత్రులారా
మీ ఊరిని..
మీ ప్రాణ సంజీవిని..
ఒక్కసారి నిన్ను నీవు చూసుకోవడానికి
నీలోని నిన్ను పరామర్శించుకోవడానికి
అప్పుడప్పుడు
మీరు కూడా
మీ ఊరికి వెళ్ళిరండి
మీ మనశ్శాంతి మందిరాన్ని
పలకరించి రండి..

శిఖా-ఆకాష్‌ 9381522247