Jun 14,2023 16:17

ముంబయి : స్టార్‌ కమెడియన్‌, నటుడు అయిన కపిల్‌ శర్మ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న షో 'కపిల్‌శర్మ షో'. పలవురు సినీతారలు సండి చేసే ఈ షో ద్వారా కపిల్‌ శర్మ అతని కో స్టార్‌ తీర్థానందరావు మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఈ షోలో కపిల్‌ శర్మ కోస్టార్‌ తీర్థానందరావు తన ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి అందరినీ షాక్‌కి గురిచేశారు.
తీర్థానందరావు తన ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ.. విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న అతని స్నేహితులు అపస్మారక స్థితిలో ఉన్న తీర్థానందరావుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స జరుగుతోంది. తను సహజీవనం చేస్తున్న మహిళ... తనని డబ్బుల కోసం వేధిస్తున్నదని తీర్ధానందరావు వీడియోలో ఆరోపించారు. ఇప్పటికే ఆమె వల్ల తాను చాలా అప్పులు చేసినట్లు తీర్థానందరావు తెలిపారు. ఆర్థికంగానే కాకుండా.. ఆమె తనపై కేసు నమోదు చేసి.. మానసికంగా వేధిస్తోందని ఆయన ఆరోపించారు.
తీర్థానందరావు గతంలో కూడా ఓసారి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆ తర్వాత అతను ఓ ఇంటర్వ్వూలో మాట్లాడుతూ... 'నేను ఆసుపత్రిలో ఉంటే చూడడానికి ఎవరూ రాలేదు. డిశ్చార్జ్‌ అయి ఇంటికొచ్చాక కూడా నేను ఒంటరిగానే ఉన్నాను. ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను. కుటుంబ సమస్యలు కూడా ఉన్నాయి' అని చెప్పుకొచ్చారు. 2016 వరకు కపిల్‌ శర్మ షోలో ఉన్న ఆయన ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో షో నుంచి వెళ్లిపోయారు.