Oct 09,2023 15:22

ప్రజాశక్తి - పెద్దాపురం : పెద్దాపురం- వాలు తిమ్మాపురం రహదారిలోని టిడ్కో కాలనీలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవో జే సీతారామారావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు మాట్లాడుతూ ఈ టిట్కో కాలనీని మున్సిపాలిటీకి అప్పగించామని టిడ్కో అధికారులు చెబుతున్నారని, మున్సిపల్ అధికారులు మాత్రం తమకు ఈ కాలనీని అప్పగించలేదని అంటున్నారన్నారు. ఈ కాలనీలో ఐదు మంచి నీటి బోర్లు ఉన్నప్పటికీ ఒకటి మాత్రమే పని చేస్తుందన్నారు.ఈ బోరు నుంచి వివిధ ప్రాంతాలకు మంచినీటిని సరఫరా చేసే ఆపరేటర్ను మున్సిపాలిటీ నియమించలేదన్నారు.దీంతో కాలనీవాసులు మంచినీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.అపార్ట్మెంట్ల వాడకం నీరు ప్రవహించే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అక్కడక్కడ పూడుకుపోవడంతో మురుగునీరు ప్రవహించే దారి లేక అపార్ట్మెంట్లు వద్ద మురుగునీరు పేరుకు పోతుందన్నారు.దీంతో అపార్ట్మెంట్లలోకి వెళ్లాలంటే మురుగు నీటిలో నుండి నడుచుకుంటూ వెళ్ళవలసి వస్తుందన్నారు.ప్రజలు దుర్వాసనతో అవస్థలు పడుతున్నారన్నారు.ఈ కాలనీలో నివసించే ప్రజలు రేషన్ కోసం తాము గతంలో అద్దె ఇళ్లల్లో నివసించిన ప్రాంతాలకు వెళ్లి రేషన్ తెచ్చుకోవాల్సి వస్తుందని,వృద్ధులు పింఛన్ తీసుకోవడానికి కూడా ఎంతో దూరం వెళ్ళవలసి వస్తుందన్నారు.పింఛను,రేషన్ ప్రతి నెల ఈ కాలనీకి వచ్చి అందజేసే ఏర్పాటు చేయాలన్నారు.ఈ కాలనీలో అక్కడక్కడ మాత్రమే వీధిలైట్లు వెలుగుతున్నాయని, కాలనీలో తుప్పలు, డొంకలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు.చీకటి పడితే పాములు సెంచరిస్తున్నాయని,దీంతో ప్రజలు రాత్రి సమయంలో కాలనీలో తిరగడానికి భయపడుతున్నారన్నారు. ప్రతిరోజు మున్సిపాలిటీ నుండి ఈ కాలనీలో చెత్త సేకరణకు ట్రాక్టర్లు గాని సిబ్బంది గానీ రాకపోవడంతో కాలనీవాసులు ఎక్కడపడితే అక్కడ చెత్తను వేయవలసి వస్తుందన్నారు. ప్రతిరోజు ఈ కాలనీ నుండి చెత్త సేకరణకు సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గడిగట్ల సత్తిబాబు, సిరపరపు శ్రీనివాస్,నెక్కల నరసింహమూర్తి, దారపు రెడ్డి కృష్ణ,చల్లా విశ్వనాథం,కాలనీవాసులు బర్ల శ్రీను, తాతపూడి శ్రీనివాస్,చింతల బలరాం,కే దుర్గాప్రసాద్, కందికొండ శ్రీదేవి, మండ పద్మావతి, గండి శివాని,ఉరిటి చంద్ర,కొమరి పార్వతి, నమ్మి నూక రత్నం,స్వాతి,లక్ష్మి, భవాని,రామ తులసి తదితరులు పాల్గొన్నారు