Sep 03,2023 16:15

బెంగళూరు :   కర్ణాటకలో త్వరలో ఆపరేషన్‌ కమలం ప్రారంభం కానుందని బిజెపి నేత కె.ఎస్‌. ఈశ్వరప్ప ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు  తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండదని అన్నారు. సగం మంది బిజెపి ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరతారని కాంగ్రెస్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోందని.. అయితే ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లలేదని అన్నారు. కర్ణాటకలో ఆపరేషన్‌ కమలం ప్రారంభమవుతుందని వందశాతం హామీ ఇవ్వగలనని స్పష్టం చేశారు.

దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి భవిష్యత్తు లేదని, 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఏ రాష్ట్రంలోనూ అధికారంలో ఉండదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదని.. 17 మంది ఎమ్మెల్యేలు బిజెపిని సంప్రదించారని అన్నారు. పార్టీ అధిష్టానం పట్ల ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని.. దానిని సరిదిద్దేందుకు యత్నిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌ కూడా అంగీకరించారని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, డి.కె. శివకుమార్‌లకు పలు అంశాలపై విభేదాలు ఉన్నాయని అన్నారు.