పాడిన పాటలు అసలే పాడకు
పొడిలా రాలిన ఎండగుర్తులు ఇంకా ఆరలేదు
వర్షపు తునకలు ఎదలో పారేలోపే
చలిగాలులు మెదడును తీసుకెళ్లేలోపే
ఇంకో రాయిని వెతుక్కుని
ఉన్ముక్తవై ఏ మేఘాల వీధిలో తచ్చాడకు సుమీ
కొంచెం భూమిపై కూడా
ఉంచు నీ పాదాన్ని
నువ్వు రాలిన పువ్వువి కాదు ఏరుకోవడానికి
వింజామరులు కాదు
నువ్వు వెతుక్కోవాల్సింది
అరచేతిలో
నీ జీవితాన్ని పెట్టుకొని
వెతకకు నీరసమైన లోకంలో
నీ కోసం నీ వైపు చూసే
సమయాన్ని తీసుకురా
మొక్క భూమిలో లోపల ఉన్న సంగతి
ఎవరికీ కానరాదు
విత్తనం చీల్చుకొని వెలుగు చూసినప్పుడు
లేతగా ముద్దుగా నేను వచ్చానంటూ
ఆ మొండి భూమికే ఆభరణంగా కాంతులిస్తూ
మనలో కూడా ఓ తడిని కదుపుతూ
చూసేకొద్దీ చూడాలనిపించేట్టు
ఎంతకూ తనివితీరక
పెరిగి పెరిగి కళ్ళముందే ఇంకా
ఒక ఊపిరిని నింపుతూ
ఒక ఆలోచనను రేపుతూ లేపుతూ
జీవన సాఫల్యానికి మూలమైనట్టు
కదలిక ఎంత అంతర్లీనం..!
బహిర్గతం అవ్వని గమనం కూడా
ఆశ్చర్యం గొల్పే అన్నీ నీలోపలే
దేన్ని మీటుతావో అది లెగుస్తుంది
దేన్ని లేపుతావో అది విజృంభిస్తుంది
ఏదో అది నువ్వే తెలుసుకోవాలి
మనలోనే అరణ్యాలు ఉన్నప్పుడు
అందులో క్రూర మృగాలు
విషపు పురుగులూ ఉంటాయి
వాటిని ఉద్యానవనంగా మలిచేపని నీదే..
- రఘు వగ్గు