ప్రజాశక్తి-వత్సవాయి : కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని ఈనెల 12వ తేదీన విజయవాడ నుండి మంగళగిరి వరకు జరుగు కౌలు రైతుల పాదయాత్రను జయప్రదం చేయండి. ఈరోజు కౌలు రైతుల సంఘం వత్సవాయి మండలం కమిటీ సమావేశం కే జానకోటయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు మాట్లాడుతూ రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలకు పైగా ఉన్న కౌలు రైతులకు 2019 పంట సాగుదారుల చట్టం ప్రకారం గుర్తింపు కార్డు మంజూరుకు భూ యజమాని సంతకం తప్పనిసరి అనే నిబంధనలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో చట్టంలో మార్పులు చేసి కౌలు రైతుకు సులభంగా గుర్తింపు కార్డు మంజూరు, భూ యజమాని సంతకం తొలగింపు సాధనే లక్ష్యంగా కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో జూన్ 5 నుండి 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార జాతాలు, సచివాలయాలు, తహశీల్దార్ కార్యాలయాల వద్ద వినతిపత్రాలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. పంట ఋణాలు, రాయితీ ఎరువులు విత్తనాలు, పంట నష్టపోతే పరిహారం దక్కక కౌలు రైతులకు అడుగడుగునా కష్టాల సాగు తప్పడం లేదని ఎద్దేవాచేశారు. భూ యజమాని సంతకం తప్పనిసరి అయిన నేపథ్యంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డు రావడం లేదని భూ యజమాని సంతకంతో పని లేకుండా గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రాల సిబ్బంది సంయుక్తంగా గ్రామ సభలు నిర్వహించి అసలైన కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంట ఋణాలు, భీమా, ఈ క్రాప్, రాయితీపై ఋణాలు, పంట అమ్ముకునేందుకు ఇబ్బందులు లేకుండా చూడాలని , ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం వాటిల్లితే పరిహారం సౌకర్యం కల్పించి కౌలు రైతుల ఆత్మహత్యలు నివారించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డు ప్రధాన అంశమని దీనికి ప్రధాన ఆటంకంగా ఉన్న భూ యజమాని సంతకం తొలగించాలన్న డిమాండ్ సాధన తమ సంఘం లక్ష్యమన్నారు.గ్రామ సభలు ఏర్పాటు చేసి భూ యజమాని కౌలు రైతులతో గ్రామ సభ నిర్వహించి అర్హులైన కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఋణాలు ,బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ డిమాండ్ సాధన కోసం12 న విజయవాడ నుండి ప్రకాశం బ్యారేజీ మీదుగా మంగళగిరి సిసిఎల్ఏ కార్యాలయంకు వద్ద రాయబార పాదయాత్ర కార్యక్రమంలో కౌలు రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు కందుల జాను కోటయ్య చిరుమామిళ్ల హనుమంతరావు మాచినేనిపల్లి గ్రామం కౌలు రైతులు బాలా శ్రీనివాసరావు, కనపర్తి పుల్లయ్య, వత్సవాయి గ్రామ కౌలు రైతులు కె హనుమంతరావు, ఏసుపోగు వెంకటరత్నం పోలంపల్లి కౌలు రైతులు కనకయ్య, రమేష్, కొండయ్య, లింగాల కౌలు రైతులు రామారావు తదితరులు పాల్గొన్నారు.










