
వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. విపరీతమైన ఎండలు.. అడవులకు అడవులే కాలిపోవడం.. పక్షులు, జంతువులు, జలచరాలు.. జాతులవారీగా అంతరించిపోవడం. కొన్నిచోట్ల అస్సలు వర్షాలు లేకపోవడం.. మరికొన్ని ప్రదేశాల్లో విపరీతమైన వర్షాలు, వరదలు, తుపానులు.. ఇలా నింగీ నేలా తారతమ్యం లేకుండా విపరీతమైన మార్పులు చోటుచేసుకోవడం కొంతకాలంగా ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాం. శాస్త్రవేత్తల హెచ్చరికలు వింటూనే ఉన్నాం. ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో తెలుసుకుందాం.
సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగటం, ధ్రువ ప్రాంతాల్లోని మంచు కరిగిపోవడం, వరదల ఉధృతి, ఎండ వేడిమి ఈ ఏడాది సెప్టెంబరు మాసంలో రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. రియో డి జనీరోలోని వెస్ట్‌జోన్‌లోని మకుంబా బీచ్ రికార్డులో సెప్టెంబర్ 24న అత్యంత వేడి నమోదైందని యూరోపియన్ యూనియన్ వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు.
సముద్ర ఉపరితలపు ఉష్ణోగ్రత అసాధారణంగా వేడెక్కిన దశను ఎల్‌నినో అంటారు. ప్రపంచంలోని వాతావరణం, అడవుల్లో సంభవించే మంటలు, పర్యావరణ వ్యవస్థల్లో పరిణామాలను తెలుపుతుంది. ఎల్‌నినో అధిక ఉష్ణోగ్రతలు వాతావరణ వ్యవస్థ క్షీణతకు మరింత ఆజ్యం పోశాయి.
తూర్పు పసిఫిక్‌లో భూమధ్యరేఖ వెంబడి ఎల్‌నినో ఏర్పడుతోంది. దీనివలన తీవ్రమైన తుపానులు సంభవిస్తాయని ఎల్‌నినో-సదరన్ ఆసిలేషన్ (ENSO) వాతావరణ నమూనా సూచిస్తోంది. ఈ వేడిమి పరిస్థితి రాబోయే శీతాకాలం వరకు, ఇకముందూ కొనసాగే అవకాశాలున్నట్లు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనివల్లనే ఋతుపవనాలు ఆలస్యమవడం.. ప్రస్తుతం అసలు వర్షాలే పడకపోవడం సంభవిస్తుంది. 'వేడెక్కుతున్న ఎల్‌నినో అంతకంతకూ పెరిగిపోతోంది' అని ఏజన్సీ సెక్రటరీ జనరల్ పెట్టెరి తాలస్ ఆందోళన వ్యక్తంచేశారు.
అయితే దీనికి వ్యతిరేక దిశలో 'లానినో' అనే రెండవ దశ పనిచేస్తుంది. అంటే అదే ప్రాంతంలో సముద్ర ఉపరితల జలాలు అసాధారణంగా శీతలీకరణ చెందుతాయి. దీనివలన మనదేశంలో కొన్ని ప్రదేశాల్లో విపరీతమైన వర్షాలు పడుతున్నాయి.
ఎల్‌నినో.. లానినో కాకుండా మూడవది తటస్థ దశ ఉంది. ఇది ఈ రెండు దశల్లోని ఉద్రిక్త పరిస్థితులను తటస్థ పరిచేందుకు ప్రయత్నిస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలోని ఈ మూడు దశలను కలిపి ఎల్‌నినో సదరన్ ఆసిలేషన్ (ENSO)గా సూచిస్తారు. ప్రపంచ ఉష్ణోగ్రత 2016లో సాధారణం కంటే 0.05 డిగ్రీలు ఎక్కువగా ఉంది. 2023 జనవరి-సెప్టెంబర్‌కి 1.40 డిగ్రీలకు చేరింది. గ్రీన్‌హౌస్ వాయువులు (GHG) భూమి మీద వాతావరణంలోని వేడిని బంధిస్తాయి. అంటే పగలు సూర్యకిరణాలు వాతావరణం గుండా ప్రసరించినప్పుడు భూమి ఉపరితలం వేడెక్కుతుంది. రాత్రి సమయంలో చల్లబడి, గాలిలోకి తిరిగి ఆ వేడి విడుదలవుతుంది. అయితే పగలు భూమిని చేరిన ఉష్ణోగ్రతలోని కొంత వేడిని గ్రీన్‌హౌస్ వాయువులు బంధిస్తాయి. భూమి ఉపరితల ఉష్ణోగ్రతను పెంచే వాతావరణంలోని వాయువులను గ్రీన్‌హౌస్ వాయువులు అంటారు. భూమి విడుదలయ్యే రేడియేషన్ తరంగ దైర్ఘ్యాలను ఈ వాయువులు గ్రహిస్తాయి. ఫలితంగా గ్రీన్‌హౌస్ ప్రభావం ఏర్పడుతుంది.
కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (జఉూ) 28 కాన్ఫరెన్స్ నవంబర్ 30 నుండి డిసెంబర్ 23 వరకు దుబారులో జరుగుతుంది. ఈ అంతర్జాతీయ సమావేశానికి వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్‌పై సంతకం చేసిన దేశాలన్నీ పాల్గొంటాయి. 'ప్రతిష్టాత్మక వాతావరణ మార్పుల కోసం అత్యవసరంగా తీసుకోవలసిన నిర్ణయాలున్నాయి. ఇవి ఈ దేశాలు ఐక్యంగా పురోగతి అంచనాలు వేస్తాయ'ని ఒక నివేదిక వెలువడినట్లు కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ సమంతా బర్గెస్ అన్నారు.