ఒక్కో ప్రాంతం వారు ఒక్కో పేరుతో పిలుచుకుంటారు. ఎవరు ఎలా పిలుచుకున్నా వాక్కాయలు మన వంటింట్లోకి వచ్చాయంటే.. ఎంతటివారికైనా మాటలకు మూతలు పడాల్సిందే.. గిన్నెలకు మూతలు తెరుచుకోవాల్సిందే.. పులుపు, వగరు రుచుల సమ్మేళనం వాక్కాయ.. అదీ వాక్కాయ రుచి మరి.. చింతకాయకి తక్కువ, ఉసిరికాయకు ఎక్కువ.. ఈ వాక్కాయ. వాక్కాయల్లో ఐరన్ రక్తహీనతతో బాధపడేవారికిది దివ్యౌషధం. ఇందులో ఉండే సి విటమిన్ అనేక రుగ్మతలను దూరం చేస్తుంది. ఈ కాయలు కొద్దిగా జిగురుగా ఉండటం వలన జెల్లీ, జామ్, సిరప్, చట్నీ తయారీలో విరివిగా వాడతారు. ఇవి సాధారణంగా హిమాలయ పర్వత ప్రాంతంలో 300 నుంచి 1800 మీటర్ల ఎత్తులో పడమటి కనుమలలోని సివాలిక్ పర్వతశ్రేణులలో పెరుగుతాయి. ఇంకా నేపాల్, ఆప్ఘనిస్థాన్, శ్రీలంకల్లోనూ.. మనదేశంలో రాజస్థాన్, గుజరాత్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లో పండుతాయి. వీటితో కొన్ని వెరైటీలు ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..
పులిహోర..
కావలసిన పదార్థాలు: వాక్కాయలు - పావుకిలో, అన్నం - 3 కప్పులు, పసుపు - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, ఆవపిండి - అర టీ స్పూను, నూనె - టేబుల్ స్పూను, జీడిపప్పు - టేబుల్ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, మినప్పప్పు, శనగపప్పు - టీ స్పూను చొప్పున, ఎండుమిర్చి - 6, పచ్చి కరివేపాకు - గుప్పెడు.
తయారీ విధానం : వాక్కాయల్ని సగానికి కోసి, గింజలు తీసి కప్పు నీటిలో ఉడికించి నీరంతా ఇగిరిపోయాక పేస్టులా మెదుపుకోవాలి. ఈ పేస్టుతో పాటు ఉప్పు, ఆవపిండిని అన్నానికి పట్టించి పక్కనుంచాలి. కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి వేగాక జీడిపప్పు, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, పసుపు, కరివేపాకు వేగించి చల్లార్చి వాక్కాయ గుజ్జు కలిపిన అన్నంలో వేసి బాగా కలపాలి. నిమ్మ, చింతపండు, దబ్బకాయ, మామిడికాయ పులిహోరలకు భిన్నంగా కొత్త రుచితో ఉంటుంది.
సలాడ్..
కావలసిన పదార్థాలు: వాక్కాయ ముక్కలు - అరకప్పు, పచ్చిమిర్చి పేస్టు - టీ స్పూన్, పంచదార - రెండు టీ స్పూన్స్, మిరియాల పొడి - అర టీ స్పూను, ఉప్పు- తగినంత, నువ్వుల నూనె - టీ స్పూను
తయారీ విధానం: ఒక గిన్నె తీసుకుని, వాక్కాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, పంచదార, మిరియాలపొడి, ఉప్పు, నువ్వులనూనె వేసి బాగా స్పూన్ పెట్టి కలపాలి. వెరైటీగా దీనిలో ఆపిల్, జామకాయ ముక్కలు కూడా కలపవచ్చు. ఈ సలాడ్‌ను భోజనానికి ముందు తినొచ్చు. సాయంత్రం వేళ కూడా తినొచ్చు. భలే బాగుంటుంది ఈ సలాడ్.
పచ్చడి
కావలసిన పదార్థాలు: వాక్కాయ ముక్కలు- కప్పు, పచ్చికొబ్బరి తురుము- అర కప్పు, పచ్చి మిరపకాయలు- ఆరు, వెల్లుల్లి రెబ్బలు- మూడు, ఉప్పు- తగినంత, జీలకర్ర - స్పూన్, నూనె - తగినంత, కొత్తిమీర తరుగు -పావుకప్పు, కరివేపాకు - రెండు రెబ్బలు, తాలింపు గింజలు - పావు టీస్పూన్, ఎండుమిర్చి -2
తయారీ విధానం: ముందుగా పాన్ తీసుకుని, అందులో నూనె వేసి వేడయ్యాక పచ్చిమిర్చి వేయాలి. అవి వేగాక వాక్కాయ ముక్కలు వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. మగ్గాక కరివేపాకు ఒక రెబ్బ, కొత్తిమీర వేసి, ఒకసారి తిప్పి చల్లార్చుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీజార్‌లో వేసి, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు కూడా వేసి, మిక్సీ పట్టుకోవాలి. పాన్‌లో మిగిలిన నూనె వేసి, తాలింపు గింజలు వేసి, కరివేపాకు కూడా వేసి, ఎండుమిర్చి తుంపి వేసుకోవాలి. ఈ తాలింపులో మిక్సీ పట్టిన పచ్చడి వేసుకోవాలి.
చికెన్..
కావలసిన పదార్థాలు: వాక్కాయలు - కప్పు, చికెన్ - అరకిలో, పసుపు - అర టీ స్పూను, అల్లవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్, ఉప్పు - రుచికి తగినంత, కారం - 3 టీ స్పూను, నూనె - తగినంత, ఉల్లిపాయ,పచ్చిమిర్చి పేస్ట్ - అరకప్పు, ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు, గరంమసాలా పొడి - అర టీ స్పూన్, కొత్తిమీర తరుగు - పావు కప్పు.
తయారీ విధానం: వాక్కాయల్ని సగానికి కోసి, గింజలు తీసి మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. చికెన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, ఉల్లి, పచ్చిమిర్చి పేస్ట్, అల్లంవెల్లుల్లి పేస్ట్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇవి పచ్చివాసన పోయి, చక్కగా వేగాక కడిగిపెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. కొద్దిసేపు మగ్గాక పసుపు, ఉప్పు వేసి కలుపుకొని, మూతపెట్టాలి. చికెన్‌లో నీరంతా ఇగిరిపోయాక వాక్కాయ ముద్ద, కారం, గరం మసాలా ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా మగ్గనివ్వాలి. చికెన్ పూర్తిగా ఉడికాక దించేముందు కొత్తిమీర తరుగు వేసి, దింపేసుకోవాలి. అంతే చికెన్ వాక్కాయ భలే టేస్టీగా ఉంటుంది.