- నేటి సాయంత్రానికి
- ప్యానెల్ పంపాలని ఇసి ఆదేశం
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు కలెక్టర్లు, ఎస్‌పిలు, పోలీస్ కమిషనర్లపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం (సిఇఒ) అధికారులు ఈ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. దానికి తోడు పలు రాజకీయపార్టీలు కూడా ఉన్నతాధికారులను బదిలీ చేయాలని సిఇసికి ఫిర్యాదు చేశాయి. ఈనేపథ్యంలో పలువురు సీనియర్ ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల్ని బదిలీ చేయాలనీ, దీనికి సంబంధించి గురువారం సాయంత్రం ఐదు గంటల లోపు ఆయా అధికారుల్ని ప్యానెల్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. బదిలీ వేటుకు గురైన వారిలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ అమోరు కుమార్, యాదాద్రి- భువనగిరి జిల్లా కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి, నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్‌రెడ్డి, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, వరంగల్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ రంగనాథ్, నిజామాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ టికె శ్రీదేవి, ఎక్సైజ్ శాఖ సంచాలకుడు ముషారఫ్ అలీతో పాటు తొమ్మిది జిల్లాల నాన్‌కేడర్ ఎస్‌పిల బదిలీకి ఇసి ఆదేశాలు జారీ చేసింది. ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది.