విశాఖ సిపిగా రవిశంకర్ అయన్నార్, కడప ఎస్‌పిగా సిద్దార్థ్ కౌశల్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :11మంది ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ డైరక్టర్ జనరల్ డాక్టర్ ఎ రవిశంకర్ అయన్నార్‌ను విశాఖపట్నం సిపిగా నియమించారు. విశాఖపట్నం సిపిగా వున్న డాక్టర్ సిఎం త్రివిక్రమ వర్మను స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్ ఐజిగా వేశారు. రైల్వే అడిషనల్ అడిషనల్ డిజిపి కుమార్ విశ్వజిత్‌ను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ డైరక్టర్ జనరల్‌గా, అక్టోపస్ ఎస్‌పి సిద్దార్థ కౌశల్‌ను కడప ఎస్‌పిగా, కడప ఎస్‌పిగా వున్న అన్బురాజన్ అనంతపురం ఎస్‌పిగా, అనంతపురం ఎస్‌పి కె శ్రీనివాసరావును విశాఖపట్నం లాఅండ్‌ఆర్డర్ డిసిపిగా, విశాఖ డిసిపిగా వున్న వి విద్యాసాగర్ నాయుడును గ్రేహౌండ్స్ ఎస్‌పిగా, ఎసిబి ఎస్‌పి బి కృష్ణారావును అన్నమయ్య జిల్లా ఎస్‌పిగా, అన్నమయ్య జిల్లా ఎస్‌పిగా పనిచేస్తున్న పి గంగాధరరావును అనంతపురంలోని 14వ బెటాలియన్ కమాండెంట్‌గా, అనంతపురంలో కమాండెంట్‌గా వున్న పి జగదీష్‌ను తూర్పు గోదావరి జిల్లా ఎస్‌పిగా వేశారు. అలాగే గ్రే హౌండ్స్ గ్రూప్ కమాండర్ అద్నాన్ నయీమ్ హష్మీని ఎసిబి ఎస్‌పిగా వేశారు. ఈ బదిలీల ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.