
ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల నేపథ్యంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ చాలా వేగంగా మారి పోతోంది. విద్యార్థుల విభిన్నమైన నేపథ్యాలు, వివిధ స్థాయిల్లో వారి విద్యా సామర్ధ్యాలు... వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, అందరికీ సమాన అవకాశాలు గల, అందరినీ కలుపుకుని పోయేలా తరగతి గదుల్లో వాతా వరణం వుండాలని, నాణ్యత గల విద్య పిల్లలందరికీ అందుబాటులోకి రావాలని, తద్వారా చదువు నేర్చుకునే క్రమంలో వారినందరినీ చురుకైన భాగస్వాములను చేయాలన్నది ఇక్కడ లక్ష్యంగా వుంది.
విద్యార్థికి విషయ పరిజ్ఞానం ఎంత వున్న దన్న అంశం నుండి విమర్శనాత్మక మైన ఆలోచనా విధానం, సమస్యను పరిష్కరించే సామర్ధ్యాలు పెంపొందిం చుకోవడంపై దృష్టి కేంద్రీకరించడం, అలాగే నేర్చుకునే క్రమాన్ని మరింత అనుభవపూర్వకంగా, సంపూర్ణంగా, సమగ్రంగా, విషయ విచారణ ఆధా రంగా వుండేలా, మొత్తంగా ఆనందించేలా రూపొందించడం లక్ష్యంగా వుంది. ఇందుకు గానూ, ప్రభుత్వం, ఉపాధ్యా యుల విధులను, వారి శిక్షణా నైపుణ్యాలను, వృత్తి పరమైన నైపుణ్యాల అభివృద్ధిని పునర్నిర్వచిస్తోంది. అయితే జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి)-2020కి అనుగుణంగా వుండేలా తీసుకువచ్చిన ఈ సంస్కరణల ఫలితాల పట్ల ఉపాధ్యాయ సంఘాలు చాలా సందేహాలను వ్యక్తపరుస్తున్నాయి. ప్రాథమిక స్కూళ్ళ లోని మూడు నుండి ఐదు తరగతులను హైస్కూళ్ళతో విలీనం చేయాలని కోరుతున్న పాఠశాల పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం వల్ల స్కూలు డ్రాపౌట్ రేటు మరింత పెరుగుతుందని, పైగా మారు మూల గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన గ్రామాల్లో వుండే పెద్ద సంఖ్య లోని విద్యార్ధులకు చదువనేది పూర్తిగా దూరమవుతుందని ఆ సంఘాలు వాదిస్తున్నాయి. రాష్ట్రంలో బోధనా సిబ్బందిని తిరిగి నియమించడంపై ప్రభుత్వం జారీ చేసిన 117 జీవో వల్ల ప్రస్తుతమున్న ఉపాధ్యాయ పోస్టులు తగ్గడానికి తోడు...తమ పని భారం కూడా పెరుగుతుందని పేర్కొంటున్నాయి.
పాఠశాల విద్యా శాఖ కొత్తగా ఫేస్ రికగ్నిషన్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్‌ను ఉపాధ్యాయలు తమ వ్యక్తిగత మొబైల్ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకోవాలని, స్కూళ్ళలో తమ రోజువారీ అటెండెన్స్‌ను రికార్డు చేయాలని కోరడం ఉపాధ్యాయులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. అయితే వర్చువల్ భద్రతా కారణాల వల్ల, ఉపాధ్యాయ సంఘాలు ఈ ఆదేశాలను పాటించడానికి తిరస్కరిస్తున్నాయి. యాప్‌ను ఉపయోగించడాన్ని బహిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులను కోరాయి. గతంలో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను ఉపయోగించుకుని ఉపాధ్యాయులు తమ అటెండెన్స్‌ను రికార్డు చేసేవారు. అప్పటి మాదిరి గానే ప్రభుత్వం తమకు ఫోన్లు అందచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆగస్టు మాసం లో ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రయోగాత్మక ప్రాజెక్టే కొత్తగా తీసుకువచ్చిన, యాప్ ఆధారిత అటెండెన్స్ వ్యవస్థ. స్కూళ్ళకు వచ్చిన టీచర్లు అక్కడ తమ హాజరును రికార్డు చేసి తాము హాజరయ్యామని చూపించుకోవాల్సి వుంటుంది. ఏకీకృత జిల్లా సమాచార విద్యా వ్యవస్థ (యు-డిఐఎస్‌ఇ) తో అనుసంథానమైన వ్యవస్థ ఆ టీచర్లు ఎక్కడ వున్నారో ఆ ప్రాంత అక్షాంశ, రేఖాంశాలు వంటి సమాచారాన్ని నమోదు చేస్తుంది. వెంటనే హాజరును ఎస్‌ఎంఎస్ ద్వారా అధికారులకు పంపుతుంది. అలాగే తమ పిల్లలు స్కూలుకు వెళ్ళిన, తిరిగి వచ్చే సమాచారం కూడా ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తల్లిదండ్రులకు అందుతుంది.
అయితే, టీచర్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకో వడం చాలా తక్కువగా వుంది. దీంతో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారా యణ ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపారు. వర్చువల్ భద్రతా కారణాలపై వారికి గల భయాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నించారు.
గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఇంటర్‌నెట్ లేక పోవడం, చాలా పేలవంగా పనిచేయడం వంటి ఇతర సమస్యలను పరిష్కస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కానీ, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల హాజరును నమోదు చేయడానికి ఏకైక వేదిక సమగ్ర 'స్కూల్ అటెండెన్స్' యాప్ మాత్రమేనని స్పష్టం చేశారు.
''పారదర్శకత, జవాబుదారీతనానికి హామీ కల్పించేందుకు మనకు సమగ్ర వ్యవస్థ అవసరం.'' అని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ పేర్కొన్నారు.
సిలబస్‌లో, పాఠశాల పునర్వ్యవస్థీకరణలో, బోధనా పద్ధతుల్లో సమూలంగా మార్పులు తీసుకు రావడంపై ప్రభుత్వం చర్యలు తీసుకుం టుండగా...ఉపాధ్యాయ సంఘాలు వీటిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
విద్యా వ్యవస్థలో ఏ మార్పు తేవాలన్నా ఉపాధ్యాయులు కీలమైనందున, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న సంస్కరణల చట్రపరిధికి ఆవల ఉపాధ్యాయులను విడిచిపెట్టలేరు. అందువల్ల ఉద్యోగులను సమర్ధవంతంగా ఒప్పించగలగడం గురించి ప్రభుత్వం ఆలోచించాల్సి వుంది.
/'ద హిందూ ' సౌజన్యంతో/
సుజాతా వర్మ