May 24,2023 16:03

ప్రజాశక్తి-తెనాలి : జగన్ సర్కార్ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతోందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు. అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ బుధవారం చెంచుపేటలోని విద్యుత్ ఈఈ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ విద్యుత్ మిగులుతో రాష్ట్రాన్ని జగన్ కి అప్పగిస్తే, విద్యుత్ లేని రాష్ట్రంగా తయారు చేశారన్నారు. యూనిట్ కి పైసా కూడా పెంచకుండా చంద్రబాబు పాలన చేశారని, వైసిపి పాలనలో సౌర విద్యుత్తును నాశనం చేశారన్నారు. నిరంతర విద్యుత్ కోతలతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. విద్యుత్ సర్చార్జీలు, ట్రూ అప్ చార్జీల పేరిట పేద ప్రజలపై ప్రభుత్వం భారం మోపిందన్నారు. విద్యుత్ చార్జీలను ఇష్టానుసారంగా పెంచిన ప్రభుత్వం, ఆ ఆదాయాన్ని ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఎన్నికలవేళ విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన జగన్ ఆ హామీని విస్మరించారన్నారు. విద్యుత్ కొరత కారణంగా  రాష్ట్రం నుంచి పరిశ్రమలు కూడా పారిపోతున్న  పరిస్థితి నెలకొందన్నారు. విద్యుత్ కార్పొరేషన్ మిద అప్పు తెచ్చిన 25వేల కోట్ల రూపాయలు ఏమి చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. గత ప్రభుత్వం  చంద్రబాబు నాయుడు సారధ్యంలో విద్యుత్ కొరత లేకుండా  పాలన చేస్తే, జగన్ మాత్రం ప్రజలను విద్యుత్ రూపంలో దోచుకునే పాలనకు తెరలేపారని ఎద్దేవా చేశారు. జగన్కు ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు విద్యుత్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు టి.హరి ప్రసాద్ మహమ్మద్ ఖుద్దూస్,పి.నరేంద్ర, జెట్టి రేణుక, పి.మహేష్, ఎన్.రమేష్, ఈ.వెంకట పూర్ణచంద్, పి.రమ్య, కె.ఏడుకొండలు, పాల్గొన్నారు.