Jun 14,2023 15:39

కరెంట్ బిల్లులతో షాక్ ఇచ్చిన జగన్ కు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదు

  • జగన్ పాలన తీరుపై... మండిపడిన టిడిపి నేతలు

ప్రజాశక్తి-ఎమ్మిగనూరు రూరల్ : ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన మోసకారి జగన్ ను వచ్చే ఎన్నికల్లో.. ప్రజలు క్షమించరని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. అధికారం టిడిపిదేనని టిడిపి నేతలు పేర్కొన్నారు. మాజీ కేంద్ర మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం స్థానిక కోట్ల క్యాంపు కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో.. ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విస్మరించారని, తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన "ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ" మేనిఫెస్టోతో  జగన్ సర్కారులో.. వణుకు పుట్టిందన్నారు. విద్యుత్ చార్జీలను అమాంతంగా పెంచి ప్రజల నడ్డి విరిచిన ఘనత జగన్ దేనన్నారు. జగన్ తన పరిపాలనలో విద్యుత్ చార్జీలను 9సార్లు పెంచడం సిగ్గుచేటని మండిపడ్డారు. జగన్ సర్కారులో కరెంటు "తీగలు" పట్టుకుంటే కాదు.. కరెంటు "బిల్లు"లను పట్టుకుంటే "షాక్" తగులుతుందని ఎద్దేవా చేశారు. "విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలకు "షాక్" ఇచ్చిన జగన్ కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే "షాక్" ఇవ్వడానికి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా..! అని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ చార్జీలతో పాటు... బస్సు చార్జీలు, ఇంటి పన్ను, చెత్త పన్ను, ఉప్పు ,పప్పు,  నిత్యవసర ధరలు, పెట్రోలు, డీజీల్ ధరలు పెంచి ప్రజల వెన్నును విరిచాడన్నారు. జే బ్రాండ్ మద్యం అమ్మకాలతో... ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర రెడ్డి, చంద్రబాబుల హాయంలో నిర్మించిన ప్రభుత్వ పక్కా గృహాలకు వన్ టైం సెటిల్మెంట్(OTS) పేరుతో డబ్బులు వసూలు చేసి రూ. 4500 కోట్లు దోపిడి చేసి పేదల రక్తాన్ని జలగల్లా పీల్చుకున్నారని దుయ్యపడ్డారు. ప్రశ్నించే గొంతుకులను అణచివేసేందుకు బ్రిటిష్ కాలం నాటి చీకటి జీవోలను తెరపైకి తెచ్చి రాచరిక పాలన,రాక్షస పాలన కొనసాగిస్తున్నారని ఆవేదన చెందారు. జగన్ పరిపాలనపై ఉన్నత న్యాయస్థానాలు వందలసార్లు చెంపపెట్టుగా మెట్టికాయలు వేసినా సిగ్గు రాకపోవడం శోచనీయమన్నారు. ల్యాండ్, శ్యాండు, వైను, మైను, లను గుప్పెట్లో పెట్టుకొని దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చిన జగన్ నేడు జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేయడం ముమ్మాటికి "ద్రోహం" చేయడమేనని తెలిపారు. ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డికి "ధనయజ్ఞం" తప్ప "జలయజ్ఞం" తెలియదన్నారు. కర్నూలు జిల్లాను సస్యశ్యామలంగా మార్చేందుకు... తమ నాయకుడు మాజీ కేంద్ర మంత్రివర్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి రాజకీయ మార్పు కోరి చంద్రబాబు సహకారంతో గుండ్రేవుల, వేదవతి, ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణం, ఎల్.ఎల్.సి. అండర్ గ్రౌండ్ పైప్ లైన్ సాగునీటి ప్రాజెక్టుల పనులకు జీ.వో.లు తీసుకువస్తే... జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే... ఆ జీ.వో.లకు "జీవం" లేకుండా చేసి, పనులు ప్రారంభించకుండా రైతులకు, జిల్లా ప్రజలకు తీరని అన్యాయం చేశారని తెలిపారు. పిచ్చి తుగ్లక్ పరిపాలనతో... జగన్ విఫలమయ్యారని ఆరోపించారు. చంద్రబాబు ప్రకటించిన మహిళలకు "మహాశక్తి", నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు, రైతులకు లక్ష రుణమాఫీ వంటి పథకాలే  తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరవీటి సుధాకర్ శెట్టి, కదిరికోట ఆదెన్న, మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జి.అల్తాఫ్, టిడిపి కురువ సాధికారిక కమిటీ జిల్లా సభ్యులు అడ్వకేట్ కే.టి. మల్లికార్జున, ఆం.ప్ర.రాష్ట్ర ఉప్పర (సగర) ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ ఉప్పర ఆంజనేయులు, ఎమ్మిగనూరు మండలం మాజీ ఆత్మ చైర్మన్ కందనాతి శ్రీనివాసులు, టిడిపి మైనార్టీ నాయకులు కె.యం.డి,అబ్దుల్ జబ్బార్ తదితరులు పాల్గొన్నారు.