'టిక్ టాక్' యాప్‌ను మార్కెట్ చేసిన 'బైట్ డాన్స్' అనే చైనా కంపెనీకి ట్రంప్ ఇటీవల 90 రోజుల అల్టిమేటం (తాఖీదు) ఇచ్చాడు. ఆ 90 రోజుల లోపల 'బైట్ డాన్స్' తన ఆస్థుల్ని వేరే ఏదైనా అమెరికన్ కంపెనీకి అమ్ముకోనైనా అమ్ముకోవాలి, లేదా కంపెనీని మూత వేసి వెళ్ళిపోవడమైనా చెయ్యాలి. అమెరికా నుండి బైట్ డాన్స్ 'టిక్ టాక్' వ్యాపారాన్ని కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలతో కూడా సాగిస్తున్నది. ఈ 'బైట్ డాన్స్' వ్యాపారం విలువ ప్రపంచం మొత్తం మీద 100 నుండి 200 బిలియన్ల డాలర్లు ఉంటుంది (అంటే రూ.7 లక్షల 50 వేల కోట్ల నుండి రూ.15 లక్షల కోట్ల మధ్య). అందులో ఒక్క అమెరికా లోనే 20 నుండి 50 బిలియన్ల వ్యాపారం ఉంది (అంటే రూ.లక్షా 50 వేల కోట్ల నుండి రూ.3 లక్షల 75 వేల కోట్ల మధ్య). ట్రంప్ అల్టిమేటం ఇచ్చిన తర్వాత 'బైట్ డాన్స్'తో మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, ట్విట్టర్ తదితర అమెరికన్ కంపెనీలు బేరసారాలు మొదలెట్టాయి. ట్రంప్ పెట్టిన 90 రోజుల గడువు మెడ మీద కత్తిలా వేలాడుతూ వుండగా 'బైట్ డాన్స్' తన మార్కెట్ విలువలో ఏ మేరకు వెనక్కి రాబట్టుకోగలుగుతుందన్నది సందేహమే. ట్రంప్ ఆ లావాదేవీల్లో అమెరికన్ ప్రభుత్వ ఖజానాకూ కొంత వాటా చెల్లించాల్సిందే అంటున్నాడు. ఇది ఖచ్చితంగా దారి దోపిడీ వంటిదే. ఒక బాధ్యత గల ప్రభుత్వం అంతర్జాతీయ వ్యాపార లావాదేవీల విషయంలో బాధ్యతగా వ్యవహరించాలే తప్ప ఈ తరహా వసూళ్ళకు దిగజారకూడదు.
ఇంతకు ముందే భారతదేశంలో 'టిక్ టాక్'ను నిషేధించారు. అంతవరకూ భారతదేశమే 'టిక్ టాక్'కు ప్రపంచంలోకెల్లా అతి పెద్ద మార్కెట్. ఈ దేశంలో 'టిక్ టాక్'ను ఉపయోగించేవారు 20 కోట్ల మంది ఉండేవారు. ఇప్పుడు 'బైట్ డాన్స్' తన భారతీయ వ్యాపారాన్ని అమ్మకానికి పెట్టడం కోసం రిలయన్స్ జియోతో చర్చలు సాగిస్తోందన్న వార్తలు వినవస్తున్నాయి.
'టిక్ టాక్'పై నిషేధం విధించడానికి మన ప్రభుత్వం కాని అమెరికన్ ప్రభుత్వం కాని చెప్పిన కారణం ఒకటే. ఒక చైనా దేశపు సోషల్ మీడియా కంపెనీ తన వాడకందారుల సమాచారాన్ని చైనా ప్రభుత్వానికి చేరవేస్తుంది అని, అలా చేయడం అంటే అది మన దేశ భద్రతకు ముప్పు అని చెప్పారు. ఇటువంటి కారణాన్ని అమెరికన్ ప్రభుత్వం చెప్పడమే విడ్డూరంగా ఉంది. తన దేశపు కంపెనీలపై ఇతర దేశాలు ఇదే కారణంతో (ఆ కంపెనీలు తమ పౌరుల సమాచారాన్ని అమెరికన్ ప్రభుత్వానికి చేరవేయవచ్చు అని) ఆంక్షలు విధించబోతే అమెరికా సుతరామూ అందుకు ఒప్పుకోలేదు. ఫేస్‌బుక్, గూగుల్ వంటి సంస్థలు అమెరికన్ గూఢచారి సంస్థలకు తమ విదేశీ వాడకందారుల సమాచారాన్ని అందించకుండా నిషేధించాలన్న అంతర్జాతీయ డిమాండ్ ను సైతం అమెరికన్ ప్రభుత్వం తోసిపుచ్చింది. మన ప్రభుత్వం గత సంవత్సరం మన దేశ పౌరుల సమాచారం మన దేశం దాటిపోకుండా ఉండాలని తీసుకున్న చర్యలను అమెరికన్ కంపెనీలకు గనుక వర్తింపజేస్తే అమెరికన్ ట్రేడ్ రెగ్యులేషన్స్ లోని 301 క్లాజు ప్రకారం భారతదేశంపై తీవ్ర చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరించింది.
మన దేశ పౌరులకు సంబంధించిన సమాచారం విదేశీ కంపెనీల దగ్గర ఉండడం మన జాతీయ భద్రతకు ముప్పు అన్నప్పుడు ఆ ముప్పు కేవలం చైనా కంపెనీల నుండే ఉంటుందా? అమెరికన్ కంపెనీల నుండి గాని మరే ఇతర దేశాల కంపెనీల నుండి గాని ఉండదా? మన పౌరుల సమాచారం మన దేశాన్ని దాటి బైటకు పోకుండా ఉండేందుకు 'జస్టిస్ శ్రీ కృష్ణ కమిషన్' కొన్ని పటిష్టమైన చర్యలను సిఫార్సు చేసింది. కాని, వాటిని అమలు చేయకుండా నీరుగార్చారు. తద్వారా ఫేస్‌బుక్, గూగుల్ వంటి అమెరికన్ సంస్థలకు తోడ్పడ్డారు. ఇప్పుడు జాతీయ భద్రత గురించి మాట్లాడుతున్నారు. అన్ని దేశాలకు, అన్ని కంపెనీలకు ఒకేలాగ వర్తించే విధంగా మన నిబంధనలు ఎందుకు లేవు? అమెరికన్, యూరోపియన్ గుత్త కార్పొరేట్ సంస్థల నుండి మన దేశానికి ఎటువంటి ప్రమాదమూ లేదని, ఇకముందు కూడా రాదని మోడీ ప్రభుత్వం చెప్పగలదా? ఇదంతా కొన్ని దేశాల వ్యాపారాలను అడ్డుకోవాలన్న అమెరికన్ వ్యూహంలో భాగంగా జరుగుతోందని, అందులో మోడీ ప్రభుత్వం కూడా పాలు పంచుకుంటున్నదని అనుకోకుండా ఉండగలమా?
ప్రపంచం మొత్తం మీద సోషల్ మీడియా రంగంలో అమెరికన్ యాప్‌ల తర్వాత దీటుగా పెద్ద మార్కెట్‌ను విస్తరించగలిగిన నాన్ అమెరికన్ యాప్ ఈ 'టిక్ టాక్'. 2020 సంవత్సరం మొదటి మూడు నెలల్లో చూస్తే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ లను మించిపోయి ఈ 'టిక్ టాక్' యాప్‌లే అధికంగా డౌన్‌లోడ్ అయ్యాయి. దాంతో ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఫేస్‌బుక్ కి 270 కోట్లమంది, యూట్యూబ్ కి 200 కోట్ల మంది వాడకందారులుంటే 'టిక్ టాక్' కి 80 కోట్ల మంది ఉన్నారు.
'బైట్‌డాన్స్' తోబాటు 'విరు చాట్' అనే మరో చైనా యాప్‌ను కూడా 90 రోజుల్లో అమెరికాను విడిచిపోవాలని ట్రంప్ ఆదేశించాడు. అమెరికాలో చదువుకుంటున్న చైనా విద్యార్ధులు, ప్రవాస చైనీయులు తమ స్వదేశం లోని బంధుమిత్రులతో మాట్లాడుకోడానికి ఈ యాప్‌ను ఎక్కువగా వాడతారు. వీరు గాక, చైనాతో వ్యాపార లావాదేవీలు నడపాలనుకుంటున్న విదేశీయులు కూడా వాడతారు. 'విరు చాట్' ఒక ఆధునిక సాంకేతిక యాప్. దీనిద్వారా జరిగే సంభాషణలో చైనీయులు వారి భాషలో మాట్లాడేదాన్ని ఇతరులకు వారి భాషలో అనువదించి తెలుపుతుంది. అలాగే ఇతరుల సంభాషణను చైనీయులకు వారి భాషలో అనువదిస్తుంది. మన దేశంలో ఈ 'విరు చాట్'ను నిషేధించడంతో మన దేశ వ్యాపార వర్గాలకు చైనా లోని భాగస్వాములతో లావాదేవీలు కొనసాగించడం చాలా ఇబ్బంది అవుతుంది.
టెలికాం రంగంలో, సోషల్ మీడియా రంగంలో అటు టెక్నాలజీ పరంగా, ఇటు మార్కెట్‌పై పట్టులోను అమెరికా ఆధిపత్యం కొనసాగినంత కాలం అమెరికా ఈ జాతీయ భద్రత వంటి అంశాల గురించి మాట్లాడలేదు సరికదా ఇతర దేశాల అభ్యంతరాలను కొట్టిపారేస్తూ వచ్చింది. ఇప్పుడు టెక్నాలజీలో తన గుత్తాధిపత్యం బలహీనపడి, టెలికాం రంగంలో ధరల తగ్గింపు పోటీలో నిలవలేక ఇప్పుడు ''పసుపు పచ్చ ప్రమాదం'' (ఎల్లో పెరిల్) గురించి భయాలను రేగగొడుతోంది. చైనా కంపెనీలను ఎన్ని దేశాల మార్కెట్ల నుండి దూరంగా ఉంచగలిగితే అంత తన కంపెనీలకు పోటీ ఉందడన్నదే అమెరికా ఉద్దేశ్యం.
'టిక్ టాక్' వంటి యాప్ లను నిషేధించడం ద్వారా వాణిజ్య యుద్ధానికి అమెరికా పూనుకోవడం కొంత అసంబద్ధంగా కొంతమందికి అనిపించవచ్చు. అయితే ఇటువంటి యాప్‌లు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే వీలున్నప్పటికీ, ఇటువంటి సోషల్ మీడియా వేదికలు పోగేసే డేటా యొక్క ఆర్థిక విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. నాలుగేళ్ళు పూర్తి కాకుండానే 'బైట్‌డాన్స్' ఆస్థులు 100-200 బిలియన్ల డాలర్ల మేరకు పెరిగాయంటే ఆ డేటా మార్కెట్ విలువ ఎంతో తెలుస్తుంది. అదే వాల్ట్ డిస్నీ కంపెనీ 180-190 బిలియన్ల ఆస్థులు పోగెయ్యడానికి దాదాపు 100 సంవత్సరాలు పట్టింది!
వాల్ట్‌డిస్నీ సంపద పెరగడానికి దాని ఉత్పత్తుల మీద గుత్తాధిపత్యం ఉండడం, కాపీ రైటు హక్కులు ఉండడం వంటి చట్టపరమైన సాధన సంపత్తి అవసరమైంది. అదే సోషల్ మీడియా వేదికల విషయంలో మనమూ మన మిత్రులూ సోషల్ మీడియా వేదికలను ఉపయోగించుకునే క్రమంలో ఎంత డేటా సేకరించబడుతోందో అదంతా సంపదే అవుతుంది. ఇన్నాళ్ళూ అమెరికా గుత్తాధిపత్యం కొనసాగుతూ వచ్చింది. ఒక్క చైనా కు సంబంధించిన డేటా మాత్రమే అమెరికన్ కంపెనీలకు చిక్కలేదు. చైనా డేటా మార్కెట్ మొత్తంగా ఇతర దేశాల వారికి అందుబాటులో లేకుండా ఉండడంతో చైనా కంపెనీలైన టెన్‌సెంట్స్ (దీని మార్కెట్ విలువ రూ.45 లక్షల కోట్ల నుండి రూ.52 లక్షల కోట్ల మధ్య ఉంటుంది.), ఆలీబాబా, బైట్ డాన్స్ వంటివి అమెరికన్ కంపెనీలకు దీటుగా ఉండే యాప్‌లను తీసుకు రావడమే గాక వాటికి విస్తృత మార్కెట్‌ను కూడా తీసుకు రాగలిగాయి. చైనా దేశం తన భూభాగం లోని ఇంటర్నెట్ ను అదుపు చేసే గ్రేట్ ఫైర్‌వాల్ అనేది కేవలం సెన్సారింగ్ చేయడం కోసమేనని చాలా మంది అనుకుంటారు. అది చైనా తన డిజిటల్ మార్కెట్‌ను కాపాడుకోడానికి ఉపయోగించే సాధనం అని చాలామందికి తెలియదు. అలా కాపాడుకోడం ద్వారా అది తన దేశీయ కంపెనీలకు మార్కెట్‌ను గ్యారంటీ చేస్తోంది.
ఇప్పుడు చైనా యాప్‌లు ప్రపంచ మార్కెట్‌లో అమెరికన్ యాప్‌ల గుత్తాధిపత్యాన్ని సవాలు చేస్తున్నాయి గనుకనే 'టిక్ టాక్, విరు చాట్' యాప్‌లను అమెరికా నిషేధించింది. ట్రంప్ ప్రభుత్వం ఈ నిషేధాన్ని ప్రకటించడం వెనుక ఫేస్‌బుక్ పాత్ర చాలా ఉంది. తన వాడకందారులను ప్రకటనలిచ్చే కంపెనీలకు అమ్మడమే ఫేస్‌బుక్ వ్యాపారమంతా. ఆ ప్రకటనల మీదే ఫేస్‌బుక్ ఆదాయంలో 98.5 శాతం వస్తుంది. అందుకే తనకు పోటీగా తయారౌతుందని భావించిన ఇన్‌స్టాగ్రామ్ ను కొనేసింది. ఇప్పుడు మరో పోటీదారుగా తయారైన 'బైట్ డాన్స్' ను నిషేధించేలా ట్రంప్ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టింది.
బైట్ డాన్స్, ఇతర చైనా కంపెనీలపై ఫేస్‌బుక్ ఏవిధంగా ప్రచారం చేపట్టిందో వివరంగా గత వారం వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. ఫేస్‌బుక్ సిఇఓ మార్క్ జుకర్‌బర్గ్ అమెరికన్ పార్లమెంటరీ కమిటీల్లో కీలక స్థానాల్లో ఉన్న సెనెటర్లతో, అధ్యక్షుడు ట్రంప్ తో ప్రైవేటుగా డిన్నర్ పార్టీలలో చర్చలు జరిపాడు. చైనా కంపెనీలు అమెరికాను మింగెయ్యడానికే వచ్చాయని, అమెరికాను కాపాడుకోవాలంటే ఫేస్‌బుక్ వంటి అమెరికన్ కంపెనీలను బలోపేతం చేయడం ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుందని జుకర్‌బర్గ్ ప్రచారం చేశాడు. అమెరికన్ టెక్ కంపెనీలు ఏవిధంగా అమెరికన్ ఆర్థిక వ్యవస్థను, సంస్కృతిని, జాతీయ భద్రతను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాయో ప్రచారం చేసేందుకు ''అమెరికన్ ఎడ్జ్'' అనే గ్రూపును ఏర్పాటు చేసి దానికి ఫేస్‌బుక్ నుండి నిధులు సమకూర్చాడు. ప్రస్తుతం లాబీయింగ్ చేయడానికి ఖర్చు చేసే అమెరికన్ కంపెనీల్లో ఫేస్‌బుక్‌దే అగ్రస్థానం. 'టిక్ టాక్, బైట్ డాన్స్' సంస్థలు ఇరుకున పడితే లాభపడేది ఫేస్‌బుక్ నే కదా.
ఇన్నాళ్ళూ అమెరికా, సంపన్న పశ్చిమ దేశాలు వాణిజ్యంలో, వ్యాపారాల్లో నియమ నిబంధనల ప్రాధాన్యత గురించి, వాటికి అందరూ లోబడి వ్యవహరించవలసిన అవసరం గురించి గట్టిగా చెప్తూ వచ్చారు. ఈ అంతర్జాతీయ న్యాయ సూత్రాలు, చట్టాలు సామ్రాజ్యవాదులకు అనుకూలంగా ఉన్నంతకాలం వాటిని గౌరవించారు. వారి ప్రయోజనాలకు అవి ఆటంకంగా నిలిచిన వెంటనే ఆ ఒప్పందాలను, చట్టాలను తోసిపారేసి తమకు నచ్చినట్టు వ్యవహరించడం వారి నైజం. ఇదేమీ ఇప్పుడు కొత్తగా వ్యక్తమైన ధోరణి కాదు. గత శతాబ్దంలో జరిగిన నల్ల మందు యుద్ధాలు ఒక ఉదాహరణ. ఈ పశ్చిమ దేశాలన్నీ తమ తమ స్వంత దేశాల్లో నల్లమందు ను నిషేధించాయి. కాని అదే నల్లమందును చైనాలో అమ్మడానికి స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో సిద్ధమైనారు. ఆ కాలంలో నల్లమందు భారతదేశంలో ఉత్పత్తి అయ్యేది. దానిని సామ్రాజ్యవాద దేశాల మద్దతు ఉన్న యూరోపియన్ కంపెనీలు చైనాలో అమ్మేవి. ఆ నల్లమందు మార్కెట్‌పై పట్టుకోసం జరిగినవే నల్ల మందు యుద్ధాలు. ఈ నల్లమందు వ్యాపారం చేసిన భారతీయ వ్యాపారులు తర్వాత కాలంలో బడా బూర్జువా వర్గంలో ఒక ముఖ్య భాగంగా రూపొందారు. ఈ నల్లమందు వ్యాపారంలో భాగస్వాములైన బ్యాంకులు, వ్యాపార సంస్థలు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిలో ఒక ముఖ్య భాగం అయ్యాయి.
ప్రపంచం ఈ నల్లమందు యుద్ధాల గురించి మరిచిపోయి వుండొచ్చు. కాని చైనీయులు మరిచిపోలేదు. ఇప్పుడు 'బైట్ డాన్స్, టిక్‌టాక్'ల అమెరికన్ వ్యాపారాన్ని మూసేయడం, రక్షిత మార్కెట్‌గా ఉన్న చైనా మార్కెట్ లోకి అందరినీ అనుమతించాలని డిమాండ్ చేయడం-ఇదంతా మరో నల్లమందు యుద్ధంగానే వారు చూస్తున్నారు. ఇదేదో చైనాకి మాత్రమే ఎదురైన సవాలు కాదు. అమెరికాకు, చైనాకు మధ్యన జరిగే వ్యాపార యుద్ధంగా మాత్రమే దీనిని చూడడం పొరపాటు. మన ముందున్న సవాలు లో 'టిక్ టాక్' ఓ చిన్న భాగం మాత్రమే. మన డేటా బేస్‌ను, దాని యాజమాన్యాన్ని ఏ గుత్త సంస్థ చేతిలో పెట్టినా అది మన ప్రజాస్వామ్యానికి, మన డిజిటల్ హక్కులకు పెద్ద ప్రమాదం అవుతుంది. ఆ గుత్త సంస్థ చైనాది కావొచ్చు, అమెరికాది కావొచ్చు, లేదా మన దేశానిదే కావొచ్చు. కాని అటువంటి సంస్థకు మన పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని, డేటా బేస్‌ను సమర్పించడం అంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టే. ఇదే మనం తేల్చవలసిన కీలకమైన అంశం.
- ప్రబీర్ పురకాయస్థ
(స్వేచ్ఛానుసరణ)










