Aug 10,2020 07:16


ముంబయి : సాధారణంగా ట్రాఫిక్‌ సిగల్స్‌ పడిన సమయంలో వాకింగ్‌ స్టిక్‌తో నడుస్తున్న పురుషుల చిహ్నాలను సైన్‌బోర్డ్‌లపై చూస్తుంటాం. అయితే ఇందుకు భిన్నంగా మహారాష్ట్ర ప్రభుత్వం మహిళల చిహ్నాలను ప్రదర్శించేలా ఏర్పాటు చేసి ప్రపంచ ప్రశంసలు అందుకుంది. ముంబయిలోని 'జినార్త్‌ వార్‌'్డ దాదర్‌ ప్రాంతంలోని 120 పాదచారుల క్రాసింగ్‌ల వద్ద ట్రాఫిక్‌ లైట్లు, సైన్‌ బోర్డులపై మహిళల చిహ్నాలను ప్రదర్శించేలా మార్పులు చేసింది. మహిళలకు సమాన ప్రాతినిథ్యం ఉందని తెలిపేందుకు ఈ విధమైన ఏర్పాట్లు చేసినట్లు మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్యథాకరే ట్వీట్‌ చేశారు. 'మీరు దాదర్‌లో సిగల్స్‌ దాటే సమయంలో గర్వకారణంగా అనిపించే ఈ మార్పును చూస్తారు. లింగ సమానత్వాన్ని, మహిళల ప్రాతినిథ్యాన్ని తెలిపేలా సైన్‌బోర్డులు కనిపిస్తాయని' ట్విటర్‌లో తెలిపారు. ఈ చర్యను ప్రశంసిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం ట్వీట్‌ చేయడం గమనార్హం. ' ఇదో మంచి వార్త. మహిళలకు సమాన ప్రాతినిథ్యం కల్పించేలా ముంబయి ట్రాఫిక్‌లైట్లు, సైన్‌బోర్డులలో మార్పులు చేసింది' అని పేర్కొంది.