సంచలనాత్మకమైన బీమా కొరెగావ్ కేసులో నిందితులపై తప్పుడు సాక్ష్యాల ప్రాతిపదికగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అభియోగాలు మోపిందన్న విషయం వాషింగ్టన్ పోస్ట్, ది హిందూ వంటి ప్రముఖ పత్రికలతో సహా మీడియాలో వెల్లడైన సమాచారంతో మరింతగా నిర్ధారణయింది. నిందితుల కంప్యూటర్ల నుంచి లభించాయని చెబుతున్న పది 'కీలక ఆధారాలు' పూర్తిగా కల్పితాలని అమెరికాకు చెందిన ఆర్సెనల్ ఫోరెన్సిక్ సంస్థ పరిశోధనలో తేలింది. నిందితుల కంప్యూటర్లలో వారికి తెలియకుండానే అరుదైన మాల్‌వేర్ సహాయంతో హ్యాకర్ దాడి చేశాడని ఆ నివేదిక పేర్కొంది. ఆ కేసులో అరెస్టు చేయబడి ప్రస్తుతం జైల్లో వున్న రోనా విల్సన్‌కి చెందిన ల్యాప్‌టాప్ లోకి మాల్‌వేర్‌తో హ్యాకర్ 10 లేఖలను వుంచారని నివేదిక పేర్కొంది. విల్సన్ ల్యాప్‌టాప్ నుండి స్వాధీనం చేసుకున్న లేఖల పైనే ప్రధానంగా బీమా కొరెగావ్ కేసులో అభియోగాలన్నీ ఆధారపడ్డాయి. నివేదికలో వచ్చిన నిర్ధారణలను స్వతంత్ర నిపుణులతో పున:పరిశీలించిన తరువాతనే మీడియా బయటపెట్టింది కనుక వాటి కచ్చితత్వంపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు ఉండనక్కరలేదు. బీమా కొరెగావ్ కేసులో అరెస్టు చేయబడ్డ చాలామంది కార్యకర్తలు తీవ్రవాద నిరోధక చట్టం (యుఎపిఎ) కింద ఎలాంటి విచారణ లేకుండా రెండేళ్ళకు పైగా శారీరక, మానసిక అస్వస్థతలతో బాధపడుతూ జైళ్లలోనే మగ్గుతున్నారు. కాబట్టి తప్పుడు కేసులతో దేశంలో అసమ్మతిని అణచివేసేందుకు ఈ కేసు ఒక నమూనా అన్న మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయ నిపుణుల ఆరోపణ సత్యదూరం కాదు. యుఎపిఎ కింద 2016 నుండి 2019 మధ్య నిర్బంధించినవారిలో కేవలం 2.2 శాతం మందిపై మాత్రమే అభియోగాలు రుజువై శిక్షలు పడ్డాయని ఫిబ్రవరి 10న పార్లమెంటులో హోం శాఖ సహాయ మంత్రి తెలిపారు. ఆ క్రూర చట్టాన్ని ఎంతలా దుర్వినియోగ పరుస్తున్నారో విదితమవుతోంది.
ఇప్పటివరకు తాము పరిశీలించిన సాక్ష్యాధారాలను తారుమారు చేయడానికి సంబంధించిన తీవ్రమైన కేసుల్లో ఇదొకటని ఆర్సెనల్ నివేదిక పేర్కొంది. తొలుత ల్యాప్‌టాప్ లోకి చొరబడడానికి, చిట్టచివరి లేఖను వుంచడానికి మధ్య సమయం దాదాపు రెండేళ్లు పట్టిందనీ, సైబర్ దాడి ఎలా జరిగిందో కూడా ఆర్సెనల్ తన నివేదికలో సవివరంగా వెల్లడించింది. అంతేగాక ఆ డాక్యుమెంట్లు విల్సన్ తెరిచినట్లుగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని ఆ నివేదిక పేర్కొంది. ఈ దాడి వెనుక గల సూత్రధారి లక్ష్యం విల్సన్ ఒక్కడే కాదని, అవే సర్వర్లను, అవే ఐ.పి అడ్రస్‌లు కొన్నింటిని ఉపయోగించి విల్సన్ సహచరులు కొందరిని కూడా లక్ష్యంగా చేసుకున్నారని నివేదిక పేర్కొంది. కాబట్టి బీమా కొరెగావ్ కేసు మాత్రమేగాక ఇంకెన్నో కేసుల్లో తప్పుడు సాక్ష్యాలను సృష్టించడానికి దర్యాప్తు సంస్థలు యత్నిస్తున్నాయని బోధపడుతోంది. సామాన్య ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగించే మోడీ సర్కారు విధానాలను వ్యతిరేకించే మీడియా సంస్థలను దెబ్బ తీయడానికి ఇడి వంటి వ్యవస్థలను దుర్వినియోగపరుస్తోంది. గతంలో ఎన్‌డిటివి కేసు మొదలు తాజాగా న్యూస్‌క్లిక్ ఆఫీసుపై, ముఖ్యుల ఇళ్లపై దాడులు, సోదాల వరకూ ఎన్నెన్నో దృష్టాంతాలున్నాయి. మీడియాకు, రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా దర్యాప్తు సంస్థలను, వివిధ చట్టాల్లోని తీవ్రమైన సెక్షన్లను అక్రమంగా ప్రయోగించి ఇక్కట్ల పాల్జేస్తున్న సర్కారు అంతర్జాలంలోని సాంకేతిక ఆయుధాలను కూడా వినియోగించడం అత్యంత ప్రమాదకరం. ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తున్న ఈ పోకడల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలి.
కొన్ని సందర్భాల్లో కక్షిదారులు తమ ప్రత్యర్థులపై తప్పుడు సాక్ష్యాలను పుట్టించి చేయని నేరానికి వారిని శిక్షింపజేయాలని చూస్తుంటారు. కానీ సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలే తప్పుడు సాక్ష్యాలు సృష్టించి కేసులు పెట్టడం సిగ్గుచేటు. అనాదిగా వున్న ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ను కూడా మోడీ సర్కారు తుంగలో తొక్కుతోందన్నమాట. తప్పుడు సాక్ష్యాల ప్రాతిపదికగా నిందితులను ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గబెట్టడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. కేంద్ర ప్రభుత్వం బీమా కొరెగావ్ కేసును ఉపసంహరించుకొని, నిందితులందరినీ వెంటనే విడుదల చేయాలి. సర్కారు విజ్ఞతతో వ్యవహరించకపోతే అన్ని వైపుల నుండి ప్రజలు, ప్రజాతంత్ర శక్తులు, సంస్థలు ఒత్తిడి చేయాలి.










