చెన్నై : ఉత్తర భారతం నుంచి వచ్చి తమిళనాడులో పనిచేస్తున్న కార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వదంతులు సృష్టించిన బిజెపి తమిళనాడు అధ్యక్షుడు కె.అన్నామలైపై చెనైు సిటీ పోలీస్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) ఆదివారం కేసు నమోదు చేసింది. మతం, జాతి, భాష ఆధారంగా రాష్ట్ర ప్రజలు, వలస కార్మికుల మధ్య శత్రుత్వం, ద్వేష భావం, ఘర్షణలు సృష్టించడానికి ప్రయత్నం చేసినందుకు అన్నామలైపై ఐపిసిలో నాలుగు సెక్షన్ల కింద సిసిబి సైబర్ క్రైమ్ డివిజన్ కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ నకిలీ క్లిప్పింగ్‌లతో తప్పుడు కథనాలు ప్రసారం చేసినందుకు దైనిక్ భాస్కర్ ఎడిటర్, జర్నలిస్ట్ మహమ్మద్ తన్వీర్, బిజెపి బాధ్యులు ప్రశాంత్ ఉమ్రావ్, సుగమ్ శుక్లాలపైనా తమిళనాడు పోలీసులు కేసులు నమోదు చేశారు. వలస కార్మికులపై అధికార డిఎంకె ఎంపీలు నీచమైన వ్యాఖ్యలు చేశారంటూ శనివారం అన్నామలై వివాదాస్పద ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే.
.










