
- అందని సాయం
- లబోదిబోమంటున్న రైతులు
ప్రజాశక్తి -నెల్లూరు ప్రతినిధి : పసుపు రైతులు మసకబారుతున్నారు. ఏడాదిపాటు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ప్రభుత్వం పంటల బీమా కల్పించడం లేదు. కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి పసుపును దిగుమతి చేసుకుంటుండడంతో రాష్ట్రంలో పండిండించిన పంటకు ధర కరువైంది. రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి, కడప జిల్లా పోరుమామిళ్ల, మైదుకూరు, బాకరాపేట, కృష్ణా, గంటూరు, పశ్చిమ గోదావరి ప్రాంతాలతోపాటు ఉమ్మడి ఎపిలో నిజామాబాద్, కరీంనగర్‌లో పసుపు పంట అధికంగా పండుతుంది. ఎకరాకు రూ.1.30 లక్షలు ఖర్చు పెట్టి తొమ్మిది నెలల పాటు పంటను సాగు చేస్తారు. గతంలో ఎకరాకు 40 క్వింటాళ్లు దిగుబడి వస్తుండగా, ప్రస్తుతం 20 క్వింటాళ్లకు పడిపోయింది. గుంపుకుళ్లు అనే వైరస్ కారణంగా పంట దెబ్బతింటుందని రైతులు చెబుతున్నారు.
ప్రభుత్వం రైతుల నుంచి కేవలం రూ.6850లకు ఒక క్వింటాలును కొనుగోలు చేస్తోంది. పెరిగిన ఖర్చుల నేపథ్యంలో కనీస మద్దతు ధర క్వింటాను రూ. 8,000కు కొనుగోలు చేస్తే గిట్టుబాటు అవుతుందని, రూ.8000 తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని రైతులు చెబుతున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో క్వింటా రూ.15,000 నుంచి రూ.17,000 ధర పలికిందని, ప్రస్తుతం సగానికి సగం పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర విషయంలో అన్యాయానికి గురవుతోన్న రైతుకు కనీసం పంట బీమా అయినా ఇవ్వాలి. రైతుల పంట బీమా కింద టిడిపి ప్రభుత్వం ఒకసారి, వైసిపి రెండు సార్లు చెల్లించింది. 2020లో ఎకరానికి రూ. 33 వేలు, 2021లో రూ.20 వేలు అందజేశాయి. ఈ ఏడాదికి సంబంధించి ఎకరాకు రూ.52వేలు నుంచి రూ.55 వేలు బీమా చెల్లించాల్సి ఉంది. ఇదిగో, అదిగో అంటూ ప్రభుత్వం కాలం గడుపుతోంది. అధికారుల చుట్టూ తిరుగుతున్నా... ప్రభుత్వం నుంచి నిధులు రావాలంటూ రైతులను వెనక్కి పంపుతున్నారు. ఏడాది కష్టపడ్డా కనీసం పెట్టుబడి కూడా రావడం లేదని, మద్దతు ధర లభించకపోతే పసుపు పంటను సాగు చేయలేమని రైతులు తెగేసి చెబుతున్నారు.
- ఇలాగైతే సాగుచేయలేం
మా ప్రాంతంలో ఎప్పటి నుంచో పసుపు సాగుచేస్తున్నాం. గతం లో పంటల బీమా కింద ప్రభుత్వం నగదు ఇచ్చింది. ఈ ఏడాది ఇంతవరకూ ఇవ్వలేదు. ఎకరానికి రూ.52 వేల నుంచి రూ.55 వేల వరకు రావాల్సి ఉంది. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని బీమా ఇప్పించాలి.
- దేవసాని చెంచురామిరెడ్డి,కృష్ణారెడ్డిపల్లి

- ధర భారీగా తగ్గిపోయింది..!
గతం కంటే ధర భారీగా తగ్గి పోయింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉన్న ప్పుడు క్వింటాలు కు రూ.15 వేలు నుంచి రూ.17 వేలు ధర వచ్చింది. ఇప్పుడు క్వింటాల్ రూ. 6,850 ఇస్తున్నారు. ఇది ఏమాత్రమూ సరిపోదు. ఏడాదికేడాది ఖర్చులు అధికమవుతున్నాయి.
- కొండా రమణారెడ్డి రైతు