Jun 14,2023 16:15

ప్రజాశక్తి-తెనాలి : పట్టణానికి చెందిన విద్యార్థి దుర్గెంపూడి కార్తికేయ రెడ్డి బుధవారం విడుదలైన ఏపీ ఎంసెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు, అలాగే మంగళవారం విడుదలైన నీట్లో జాతీయస్థాయిలో 237 వ ర్యాంకును సాధించి తెనాలి ప్రాంతానికి గర్వకారణంగా నిలిచాడు. స్థానిన మారీసుపేట ఆర్ఆర్ నగర్కు చెందిన దుర్గెంపూడి వెంకటరామిరెడ్డి, ఉమామహేశ్వరి దంపతుల కుమారుడు కార్తికేయ రెడ్డి విజయవాడ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ చదివాడు. తండ్రి వెంకటరామిరెడ్డి విద్యుత్ శాఖలో ఏఈగా పనిచేస్తూ కరోనా సమయంలో మృతి చెందారు. ఈ సందర్భంగా కార్తికేయ రెడ్డి మాట్లాడుతూ జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకమైన సంస్థలో ఎంబిబిఎస్ పూర్తి చేసి, కార్డియాలజీలో పీజీ చేయాలన్నదే తన లక్ష్యంగా చెప్పాడు. చిన్నప్పటి నుంచి తన విద్యా విధానంలో తల్లిదండ్రులతో పాటు అమ్మమ్మ ,తాతయ్యలు రాజేశ్వరి, పేరి రెడ్డి పూర్తి సహకారాన్ని అందించారన్నారు. తల్లి ఉమామహేశ్వరి మాట్లాడుతూ కార్డియాలజీలో పీజీ చేసి గుండె వైద్య నిపుణులుగా పేరొందాలన్నది తన కుమారుడి ఆశయమని చెప్పారు. చిన్నప్పటి నుంచి ఎంతో క్రమశిక్షణ, పట్టుదలతో చదివిన కార్తికేయ రెడ్డి ఆల్ ఇండియా స్థాయి నీట్ లో జనరల్ కేటగిరీలో 237, ఏపీ ఎంసెట్లో రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు సాధించడం గర్వంగా ఉందన్నారు.