Aug 20,2020 19:58

* నేటి నుంచి 26 వరకూ నిరసన వారం


ప్రజాశక్తి-కృష్ణాప్రతినిధి, విజయవాడ
            కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, విజయవాడ నగరంలో పాటు కృష్ణాజిల్లాలో ప్రజాసమస్యలు పరిష్కారం కోరుతూ ''నిరసన వారం'' కార్యక్రమానికి సిపిఎం సిద్ధమైంది. సిపిఎం పశ్శిమ, తూర్పు కమిటీల ఆధ్వర్యంలో ఇప్పటికే పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. నెల 20 నుంచి 26 వరకు వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. సిపిఎం శ్రేణులు, దాని శ్రేయోభిలాషులు, ఆయా రంగాల ప్రజలను సమీకరించి వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతారు. విజయవాడ నగరంలోని పశ్చిమ నియోజకవర్గంతో పాటు సెంట్రల్‌, తూర్పు నియోజకవర్గాల్లోని ఆ పార్టీ సిటీ కమిటీలు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇప్పటికే వివిధ రూపాల్లో ప్రచారాన్ని నిర్వహించాయి. ప్రతి వీధి, ప్రతి డివిజన్‌ ఇలా మూడు నియోజకవర్గాల పరిధిలోని ఆ పార్టీ శ్రేణుల్లో విస్తృతంగా ప్రచారాన్ని తీసుకెళ్లాయి. బిల్డింగ్‌ రంగం, ముఖ్యంగా అసంఘటితరంగ కార్మికులు, హమాలీలు, పేద, మధ్యతరగతి ప్రజలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆటో కార్మికులు, ఆటోనగర్‌ కార్మికులు, షాపు ఎంప్లాయీస్‌ తదితర రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగ, కార్మికుల్లో పెద్ద ఎత్తున ప్రచారాన్ని తీసుకెళ్లాయి. కరపత్రాలు, గ్రూపు మీటింగ్‌లు, జనరల్‌ బాడీలు, యూ ట్యూబ్‌ ద్వారా బహిరంగ సభ తదితర రూపాల్లో ''నిరసన వారం'' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆపార్టీ మూడు నియోజకవర్గాలకు చెందిన నాయకత్వం పిలుపు నిచ్చింది. పార్టీ ఇచ్చిన నిరసన వారం కార్యక్రమంలో ప్రతి కార్యకర్త, ప్రతి శ్రేయోభిలాషి, అసంఘితర రంగ కార్మికులు, ఉద్యోగ, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పశ్చిమ, సెంట్రల్‌, తూర్పు సిటీ కమిటీల కార్యదర్శులు నాగోతు ప్రసాద్‌, డి విష్ణువర్ధన్‌, బోజడ్ల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
ప్రధాన డిమాండ్స్‌...
''నిరసన వారం'' కార్యక్రమంలో ప్రధానంగా పలు డిమాండ్స్‌ను సిపిఎం శ్రేణులు వినిపించనున్నాయి. ప్రతి వ్యక్తికి 10 కిలోల ఉచిత ఆహార ధాన్యాలు వెంటనే పంపణీ చేయాలి. ఇది వచ్చే ఆరు నెలల పాటు అమలు చేయాలి. ఏడాదికి కనీసం 200 రోజుల పాటు పనులు కల్పించాలి. మెరుగైన వేతనాలు చెల్లించాలి. పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావాలి. నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలి. వచ్చే ఆరు నెలల పాటు రూ. 7,500 చొప్పున ఆదాయపు పన్ను పరిధికి వెలుపుల ఉన్న అన్ని కుటుంబాలకు నగదు బదిలీ చేయాలి. కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు మెరుగైన వైద్యం సక్రమంగా అందించాలి. కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాన్ని 12 గంటల లోపు ఇవ్వాలి. ప్రయివేటు వైద్యశాలల్లో ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్యం అందించాలి. కోవిడ్‌-19 క్వారంటైన్‌ కేంద్రాలను మరిన్ని పెంచాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను ఆపాలి. రైల్వేలు, విద్యుత్‌, పెట్రోలియం, బొగ్గు, బ్యాంక్‌లు, బీమా, రక్షణ ఉత్పత్తి రంగాల ప్రయివేటీకరణ ఆపాలి.ఇప్పటికే ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేయడానికి, సవరించడానికి, నిలిపివేయడానికి ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి. అంతరాష్ట్ర వలస కార్మికుల చట్టాన్ని రద్దుచేయాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి.( ఉపాధి శాశ్వితం, పరిస్థితులు) 1979 చట్టాన్ని బలోపేతం చేయాలి. ప్రైవేట్‌ ట్రస్ట్‌ ఫండ్‌లో సేకరించిన అన్ని నిధులను మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముందు వరసలో పోరాడుతున్న రాష్ట్రాలకు బదిలీ చేయాలి. ఎసెన్షియల్‌ కమోడిటీస్‌ యాక్ట్‌ను తొలగించే ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలి. అలాగే క్రమబద్దీకరించని ధరల ఆధారంగా రాష్ట్రాల్లో ఆహార ధాన్యాలు స్వేచ్చగా తరలించడానికి అనుమతించేలా ఎపిఎంసి చట్టాన్ని సరవరించాలి. మహమ్మారిని ఎదుర్కోవడానికి విపత్తు నిర్వహణ చట్టం అమలు చేయబడినందున జాతీయ విపత్తు సహాయ నిధి నిబంధనల ప్రకారం మహమ్మారి సోకి మరణించిన బాధితుల కుటుంబాలకు ఒక సారి ఆర్థిక సహాయం ప్రకటించాలి. ఎస్సీ, ఎస్టీ, ఒబిసి వికలాంగుల రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు చేయాలి, బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేయాలి.ప్రజారోగ్యంపై కేంద్ర వ్యయాన్ని జిడిపిలో కనీసం మూడు శాతం పెంచాలి, దళితులపై పెరుగుతున్న కులహింస, మహిళలపై గృహ, లైంగిక హింస, గిరుజనుల దోపిడీకి పాల్పడే వారిని శిక్షించాలని తదితర డిమాండ్లు పరిష్కారం కోరుతూ ఈ నిరసన వారం కార్యక్రమం కొనసాగనుంది.