
న్యూఢిల్లీ : పదో తరగతి పాఠ్యపుస్తకం నుండి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సిఇఆర్‌టి) పలు చాప్టర్లను తొలగించింది. సిలబస్ హేతుబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా పదో తరగతి పాఠ్యపుస్తకాల్లో ఈ అధ్యాయాలను పూర్తిగా తొలగిస్తున్నట్లు పేర్కొంది. కొత్తగా విడుదల చేసిన పాఠ్యపుస్తకాల్లో పిరియాడిక్ టేబుల్ (ఆవర్తన పట్టిక), ప్రజాస్వామ్యం, శక్తి వనరులు వంటి పాఠాలను తొలగించింది. సైన్స్ పాఠ్యపుస్తకం నుండి చాప్టర్ 5: పిరియాడిక్ టేబుల్, చాప్టర్ 14: శక్తి వనరులు, చాప్టర్ 16: పర్యావరణ సుస్థిరత వంటి అభ్యాసాలను తొలగించారు. అలాగే పదో తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్య పుస్తకంలోని చాప్టర్ 5: ప్రముఖ ప్రజా పోరాటాలు, ఉద్యమాలు, చాప్టర్ 6: రాజకీయ పార్టీలు, చాప్టర్ 8: ప్రజాస్వామ్యానికి సవాళ్లు అన్న పాఠ్యాంశాలను పూర్తిగా తొలగించారు.ఆవర్తన పట్టిక రసాయన శాస్త్రవేత్తల మేథో సంబంధిత విజయాలలో ఒకటని కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో సైన్స్ విద్య పరిశోధకుడు జోనాథన్ ఓస్బోర్న్ పేర్కొన్నారు.
కరోనా సమయంలో విద్యార్థులపై సిలబస్ భారాన్ని తగ్గించడం అత్యవసరమని ఎన్‌సిఇఆర్‌టి వాదించింది. కష్టమైన సబ్జెక్టు, అతిగా వ్యాప్తి చెందుతున్న సమాచారం, అసంబద్ధమైన సమాచారం పేరుతో ఆయా పాఠ్యాంశాలను తొలగిస్తున్నట్లు పేర్కొంది. బిజెపి ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత నెలలో 9వ తరగతి, 10వ తరగతి సైన్స్ పాఠ్యపుస్తకాల నుంచి చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని ఎన్‌సిఇఆర్‌టి తొలగించిన సంగతి తెలిసిందే.