Nov 08,2023 11:18

రాష్ట్రపతికి  అదీర్‌ రంజన్‌ లేఖ

న్యూఢిల్లీ :   చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ (సిఐసి) నియామకపు ప్రక్రియ గురించి తనకేమీ తెలియనివ్వకుండా చీకటిలోకి నెట్టేసారని, ప్రజాస్వామ్య నిబంధనలు, పద్దతులన్నీ గాలికి వదిలేశారని కాంగ్రెస్‌ ఎంపి, సెలక్షన్‌ కమిటీ సభ్యుడు అదీర్‌ రంజన్‌ చౌదరి విమర్శించారు. దీనిపై ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ప్రతిపక్షాల వాణిని నిర్లక్ష్యం చేశారని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌గా మాజీ ఐఎఎస్‌ ఆఫీసర్‌ హీరాలాల్‌ సమారియా చేత ఈ నెల 6వ తేదీన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాని మోడీ నేతృత్వాన సెలక్షన్‌ కమిటీ సమావేశం సమయాన్ని నవంబరు 3వ తేదీన సాయంత్రం నుండి ఉదయానికి మార్చాల్సిందిగా తాను కోరానని, సమావేశం సమయాన్ని మార్చకపోగా, కనీసం తీసుకున్న నిర్ణయాల గురించి కూడా తనకు తెలియచేయలేదని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు.ప్రధానమంత్రి, హోం మంత్రి మాత్రమే ఆనాటి సమావేశానికి హాజరయ్యారని, సెలక్షన్‌ కమిటీ సభ్యుడిగా ప్రతిపక్షానికి చెందిన తాను లేనని, అయినా సమావేశం జరిగిన గంటల వ్యవధిలోనే ఎంపిక చేసిన అభ్యర్ధుల పేర్లను ప్రకటించడం, నోటిఫై చేయడం, ప్రమాణ స్వీకారం జరగడం అన్నీ అయిపోయాయని అన్నారు. ఈ తీరు ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రమూ మంచి సంకేతం కాదని ఆయన ఆ లేఖలో స్పష్టం చేశారు.