Jul 28,2022 14:40

న్యూఢిల్లీ : 'బైకాట్‌ ఫ్లిప్‌కార్ట్‌' 'బైకాట్‌ అమెజాన్‌' ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న హ్యాష్‌ట్యాగ్స్‌. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థలనున బైకాట్‌ చేయాలన్న ఈ పిలుపుకు అసలు కారణం ఏంటో తెలుసా. ప్రముఖ దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఫోటోతో ఉన్న టీ షర్ట్‌పై అనుచిత సందేశాన్ని వినియోగించడంతో సంస్థలను బైకాట్‌ చేయాలని నెటిజన్లు పిలుపునిచ్చారు. ఈ ఆన్‌లైన్‌ సైట్లలో అందుబాటులో ఉన్న టీ షర్టుపై సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ముఖంతో పాటు 'డిప్రెషన్‌ ముంచుకొస్తుంది' అంటూ సందేశం ఉంది. దీనిపై సుశాంత్‌ అభిమానులు మండిపడుతున్నారు. ఆయన్ను అవమానిస్తున్నారంటూ ఈ ఆన్‌సైట్లను బైకాట్‌ చేయాలంటూ హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తిని ఇందులోకి తీసుకురావడం వల్ల మీ ఉత్పత్తిని మార్కెంటింగ్‌ చేసుకోలేరంటూ ఫ్లిప్‌కార్ట్‌నుద్దేశించి ఓ నెటిజన్‌ వ్యాఖ్యానించారు. వారి కుటుంబం కోసం ఆలోచించండని పేర్కొన్నారు. మరో నెటిజన్‌.. ఇంకా సుశాంత్‌ మరణం నుండి ఇంకా దేశం కోలుకోలేదని, న్యాయం కోసం గళం విప్పుతామని, ఫ్లిప్‌కార్ట్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.