Apr 24,2023 16:31
  • అత్య‌వ‌స‌ర శ‌స్త్రచికిత్స చేసిన క‌ర్నూలు కిమ్స్ వైద్యులు
  • ఆ భాగానికి ర‌క్త‌ప్ర‌సారం ఆపేందుకు ప్ర‌త్యేక చికిత్స‌

ప్రజాశక్తి కర్నూలు హాస్పిటల్ : మాన‌వ శ‌రీర అవ‌య‌వాల్లో కాలేయం పాత్ర చాలా కీల‌కం. ఇది చాలా సున్నిత‌మైన‌ది కూడా. దీనికి సంబంధించిన స‌మ‌స్య‌లు ఏమైనా వ‌స్తే అత్యంత నైపుణ్యంతో చికిత్స చేయాలి. అలా కాకుండా ఒక‌దాని బ‌దులు మ‌రొక‌టి చేస్తే లేనిపోని స‌మ‌స్య‌లు రావ‌డంతో పాటు ప్రాణాపాయం కూడా సంభ‌వించే ప్ర‌మాద‌ముంది. ఇలాంటి ఒక కేసులో క‌ర్నూలు కిమ్స్ వైద్యులు స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించి, ఓ మ‌హిళ ప్రాణాలు కాపాడారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను క‌ర్నూలు కిమ్స్ ఆస్ప‌త్రి క‌న్స‌ల్టెంట్ స‌ర్జిక‌ల్ గ్యాస్ట్రోఎంట‌రాల‌జిస్టు డాక్ట‌ర్ సూరా జాన‌కిరాం మీడియాకు తెలిపారు. ఓర్వ‌క‌ల్లుకు చెందిన 43 ఏళ్ల మ‌హిళకు క‌డుపు నొప్పి ఉండటంతో కొన్ని ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు వెళ్లారు. సీటీ స్కాన్ చేయించి చూడ‌గా, లోప‌ల కాలేయం ద‌గ్గ‌ర గ‌డ్డ ఉన్న‌ట్లు క‌నిపించింది. దాన్ని వైద్య ప‌రిభాష‌లో హిమాంజియోమా అంటారు. వెంట‌నే ప్ర‌భుత్వాస్ప‌త్రికి వెళ్ల‌గా శ‌స్త్రచికిత్స చేయాల‌ని, అందుకు హైద‌రాబాద్ వెళ్లాల‌ని సూచించారు. హైద‌రాబాద్ నుంచి మ‌ళ్లీ క‌ర్నూలు కిమ్స్ ఆస్ప‌త్రికి పంపారు. అయితే అప్ప‌టికే లోప‌ల ర‌క్తం కొంచెం కారి, కాలేయం మీద బొప్పిలా క‌ట్టింది. ఫ‌లితంగా ఆమెకు విప‌రీత‌మైన క‌డుపునొప్పి వ‌చ్చింది. సాధార‌ణంగా ఇలాంటి గ‌డ్డ‌లు ఏర్ప‌డిన‌ప్పుడు సీటీస్కాన్ ప‌రిశీలించి నేరుగా శ‌స్త్రచికిత్స చేయాలి. క‌డుపునొప్పి ఎక్కువ రావ‌డంతో క‌ర్నూలు కిమ్స్ ఆస్ప‌త్రికి రావ‌డం వెంట‌నే స్కాన్ చేసి ప‌రీక్షించారు. లోప‌ల ర‌క్త‌పుగ‌డ్డ ఉంద‌ని తెలియ‌డంతో ముందుగా ఇంట‌ర్వెన్ష‌న‌ల్ రేడియాల‌జిస్టు డాక్ట‌ర్ అశోక్ రెడ్డి నేతృత్వంలో యాంజియోగ్రామ్ ద్వారా ర‌క్త‌పుగ‌డ్డ చుట్టూ ఉన్న ర‌క్త‌నాళాల‌న్నింటినీ మందుల ద్వారా బ్లాక్ చేశారు. శ‌స్త్రచికిత్స స‌మ‌యంలో ర‌క్త‌స్రావం ఎక్కువ కాకుండా ఆపేందుకు ఇలా చేశారు. త‌ర్వాతిరోజు ఉద‌యం డాక్ట‌ర్ జాన‌కిరాం నేతృత్వంలో శ‌స్త్రచికిత్స చేసి మొత్తం గ‌డ్డ‌ను తీసేశారు. మ‌త్తు వైద్య నిపుణురాలు డాక్ట‌ర్ శృతి కూడా త‌న స‌హ‌కారం అందించారు. ప్ర‌స్తుతం రోగి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కావ‌డంతో పాటు, కుట్లు కూడా విప్పేశారు. ఆమె త‌న రోజువారీ ప‌నుల‌న్నింటినీ సుల‌భంగా చేసుకోగ‌లుగుతున్నారు. 

కాలేయానికి సంబంధించిన ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు సాధార‌ణంగా హైద‌రాబాద్, బెంగ‌ళూరు లాంటి పెద్ద న‌గ‌రాల్లో ఉన్న పెద్ద‌పెద్ద ఆస్ప‌త్రుల‌లోనే శ‌స్త్రచికిత్స‌లు చేస్తారు. క‌ర్నూలు లాంటి ద్వితీయ‌శ్రేణి న‌గ‌రాల్లో ఇలాంటివి జ‌ర‌గ‌డం చాలా అరుదు. అంత సున్నిత‌మైన అవ‌య‌వానికి సంబంధించిన సంక్లిష్ట స‌మ‌స్య‌ను కూడా సుల‌భంగా, అది కూడా ఆరోగ్య‌శ్రీ ద్వారా పూర్తి ఉచితంగా చేసి, త‌మ ప్రాణాలు కాపాడినందుకు రోగి, ఆమె కుటుంబ‌స‌భ్యులు క‌ర్నూలు కిమ్స్ ఆస్ప‌త్రి యాజ‌మాన్యానికి, వైద్య నిపుణుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.