
రాష్ట్ర రాజధాని అంశం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, చేసిన వ్యాఖ్యలు ఆహ్వానించదగినవిగా ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల హక్కుల గురించి ధర్మాసనం ప్రత్యేకంగా ప్రస్తావించిన తీరు హర్షణీయం. రాజధానిని తమ ప్రాంతం నుండి తరలించినా, పేరుకే పరిమితం చేసినా తమ గతి, పిల్లల భవిష్యత్తు ఏమవుతుందంటూ ఆందోళన చెందుతున్న రైతులకు అత్యున్నత న్యాయస్థానం చూపిన చొరవ, ప్రభుత్వాన్ని వేసిన ప్రశ్నలు కొంత మేరకు ఊరటనిస్తాయి. పార్లమెంటు చేసిన రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ (విభజన) చట్టాన్ని, అందులో ఒకే రాజధాని అని అర్ధం వచ్చేలా పేర్కొన్న 'ది క్యాపిటల్' అనే పదాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఆ చట్టంలో సవరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేనప్పుడు, అందులోని అంశాలను మార్చే అధికారం ఎలా ఉంటుందని నిలదీసింది. అదే సమయంలో రాజధాని ఒకచోట, హైకోర్టులు మరో చోట ఉన్న వివిధ రాష్ట్రాల వివరాలనూ పేర్కొంది. గత ప్రభుత్వం రూపొందించి, భూములు సమీకరించిన సిఆర్‌డిఎ చట్టాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. అభివృద్ధిని ఆశించి చట్టబద్దంగా భూములు వదులుకున్న 29 వేల మంది రైతులకు ఇచ్చిన హామీని ఎలా ఉల్లంఘిస్తారని, సిఆర్‌డిఎ చట్టాన్ని అమలు చేయకపోతే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినట్టు కాదా అని ప్రశ్నించింది. ప్రజాస్వామ్యంలో పాలకులు మారవచ్చు, కానీ ప్రభుత్వమన్నది నిరంతర ప్రక్రియ. అత్యున్నత న్యాయస్థానం రైతాంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంధించిన ప్రశ్నలలో ఈ స్ఫూర్తే కనిపిస్తుంది. రాజధాని ప్రాంతంలోని కొన్ని పనులను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలంటూ, ఆరు నెలల్లో అమరావతి నగరాన్ని నిర్మించాలంటూ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు ఆచరణలో సాధ్యం కావు. ఇటువంటి ఐదు అంశాలపై స్టే ఇవ్వడం, ఆ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆచరణాత్మకంగా అనిపిస్తున్నాయి.
ఈ విచారణ సందర్భంగానే మరో కీలకాంశమైన కర్నూలుకు హైకోర్టు తరలింపు కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్బంగా సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అంశాలకు, కోర్టు బయట మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలకు పొంతన లేకుండా ఉంది. ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని స్పష్టంగా చెప్పారు. దీనిపై కోర్టు రెట్టించి అడిగినప్పుడు కూడా మూడు రాజధానుల చట్టం రద్దు అయింది కాబట్టి, హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని ఆయన అన్నారు. 'మరో చట్టం తెస్తే దానిలో ఏముంటుందో తనకు తెలియదని, ఇప్పటికైతే సిఆర్‌డిఎనే అమలులో ఉందని, దాని ప్రకారం హైకోర్టు అమరావతిలోనే ఉంటుంది' అని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. వికేంద్రీకరణ పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం కోర్టులో గట్టిగా ఎందుకు చెప్పలేకపోయిందన్నది పలువురి సందేహం. పైగా ఏయే రాష్ట్రాల్లో హైకోర్టులు, రాజధాని నగరాలు వేరువేరుగా ఉన్నాయో న్యాయమూర్తులు స్పష్టంగా చెప్పిన తరువాత కూడా నీళ్లు నమలాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఎందుకొచ్చింది? మరోవైపు కోర్టులో సందర్భానుసారం లాయర్ చెప్పిన మాటలన్నీ ప్రభుత్వ విధానాలైపోతాయా? అని మంత్రులు న్యాయస్థానం బయట ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా వైఖరి ప్రజలలో మరింత పలచన కావడానికే తప్ప ప్రభుత్వానికి మరే విధంగానూ ఉపయోగపడదు.
సుప్రీంకోర్టులో జరిగినవి ప్రాథమిక వాదనలే! ఆ పరిమితిలోనే కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు వాస్తవిక దృక్పధంతో వ్యవహరించాలి. తమ పార్టీతో పాటు, రాష్ట్రంలోని ఇతర పార్టీలు ఆమోదించి, బలపరిచిన అమరావతిని రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలి. హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలి. ఉత్తరాంధ్రతో పాటు, రాష్ట్రంలో వెనుకబడిన ఇతర ప్రాంతాల అభివృద్ధికి ఆచరణాత్మక ప్రణాళికను రూపొందించాలి. విజభన చట్టం ప్రకారం నిధులు రాబట్టడానికి, ఆ చట్టంలోని ఇతర హామీల అమలుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. అధికార పార్టీ చొరవ తీసుకుని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. రాష్ట్రాభివృద్ధికి ఈ తరహా దృక్పధమే దోహదం చేస్తుందన్న విషయాన్ని పాలకులు గుర్తించాలి.