
రోడ్లపై బహిరంగ సమావేశాలకు షరతులు విధిస్తూ తెచ్చిన జిఓ నెంబర్ 1 అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాల్ చేయడం రాష్ట్ర ప్రభుత్వ ఉలికిపాటును తెలుపుతుంది. తన నిర్ణయానికి న్యాయస్థానాలైనా సరే అడ్డు చెప్పకూడదన్న అసహనం ప్రభుత్వంలో ప్రస్పుటిస్తోంది. రహదారులపై ర్యాలీలు, రోడ్‌షోలు, బహిరంగ సభలు పెట్టుకోవాలంటే ముందస్తుగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని జనవరి 2న ప్రభుత్వం జిఓ నెం.1 జారీ చేసింది. ఈ ఉత్తర్వు వెనకున్న సర్కారు ఉద్దేశం ప్రజా ఉద్యమాలను నిరోధించడం, ప్రతిపక్ష పార్టీలను నిలువరించడానికేనన్నది దాచాలనుకున్నా దాగని వాస్తవం. సదరు జిఓకు సర్కారు ఎంపిక చేసుకున్న ప్రాతిపదిక ఏనాడో స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ పాలకులు తెచ్చిన 1861 నాటి పోలీస్ చట్టం. గొంతు నొక్కేందుకే రాజ్యాంగ, చట్ట విరుద్ధంగా ప్రభుత్వం జిఒ తెచ్చిందంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఈ నెల 12న విచారించిన రాష్ట్ర హైకోర్టు, పోలీస్ చట్టంలోని సెక్షన్ 30కి జిఓ విరుద్ధంగా ఉందని ప్రాథమికంగా అభిప్రాయపడి, దాని అమలును ఈ నెల 23 వరకు సస్పెన్షన్‌లో ఉంచుతూ మధ్యంతర ఆదేశాలిచ్చింది. విచారణ 20న జరుపుతామంది. మరో రెండు రోజుల్లో హైకోర్టులో విచారణ ఉండగా, జిఓ సస్పెన్షన్ కాల పరిమితి ఇంకో ఐదు రోజులే కాగా, ఆ స్వల్ప విరామాన్ని సైతం ఎందుకు భరించలేక సుప్రీం గడప తొక్కిందో ప్రభుత్వం చెబితేనే బాగుంటుంది.
జిఓపై ఇక్కడ హైకోర్టులో అక్కడ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో ప్రభుత్వ వాదనలు పొసిగేవి కావు. రెండు చోట్లా సర్కారు అభ్యంతరం హైకోర్టు విచారణార్హత మీదనే. జిఓను సవాల్ చేస్తూ వేసిన పిల్‌ను సంక్రాంతి వెకేషన్ బెంచ్ అత్యవసరంగా విచారించకూడదనే. రాజ్యాంగ, పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే ప్రభుత్వ ఏ నిర్ణయాన్నైనా ప్రజా సంక్షేమం దృష్ట్యా పరిశీలించే విచక్షణ న్యాయస్థానాలకు ఉంటుంది. ఆ విషయాన్నే హైకోర్టు నొక్కివక్కాణించింది. ప్రభుత్వం కౌంటర్ వేశాక వారంలో పూర్తి స్థాయిలో విచారిస్తామనీ చెప్పింది. అప్పటి వరకు ఆగి ఉంటే ఒక రకంగా ఉండేది. ఆ మాత్రం ఓర్పూ సర్కారులో కొరవడింది. రాజకీయ పార్టీలు పోలీసుల నియంత్రణ లేకుండా ర్యాలీలు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తే తొక్కిసలాటలు జరుగుతాయని, 8 మంది మృత్యువాత పడ్డ ఇటీవలి ఘటనలు పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రభుత్వం తెగ బాధ పడిపోయింది. జిఓ వచ్చి పది రోజులైనా కాలేదు. అప్పుడే ఏం జరిగిందని పిల్ వేశారని హైకోర్టులో వాదించిన ప్రభుత్వం... జిఓ సస్పెన్షన్‌పై సుప్రీంలో హడావిడిగా అప్పీల్ చేయడం ఎందుకు?
మన రాజ్యాంగం పౌరులకు భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కును కల్పించింది. ప్రభుత్వాలకు అది గిట్టడం లేదు. తమ పాలనపై, విధానాలపై అసమ్మతి, వ్యతిరేకత, నిరసన తెలిపితే సహించలేకపోతున్నాయి. ఆ విషయంలో బిజెపి నాలుగు ఆకులు ఎక్కువే చదివింది. టిడిపి సైతం మినహాయింపు కాదు. ఆ కోవలో వైసిపి ప్రభుత్వం ఏకంగా జిఓ నెం.1 తెచ్చింది. ప్రభుత్వాలు రాజ్యాంగం, చట్టాలకు లోబడి నడవాలి. హద్దులు దాటినప్పుడు న్యాయస్థానాలు సమీక్షించి గాడిలో పెడతాయి. తమకు అధికారం ఉంది కనుక ఏం చేసినా చెల్లుతుంది, కాదనే వీల్లేదనడం ప్రజాస్వామ్యంలో కుదరదు. గతంలో కొన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు పోయి న్యాయస్థానాల్లో చేతులు కాల్చుకున్న సందర్భాలున్నాయి. రాజకీయ పార్టీల బహిరంగ సమావేశాలపై నిషేధం లేదని సర్కారు ఉటంకింపు అర్ధసత్యం. తమకు నచ్చని వారికి వ్యతిరేకంగా నచ్చిన వారికి అనుకూలంగా పోలీసులు వ్యవహరించే పక్షపాతం సర్కారే కల్పించడం వివక్ష. ఇది ఏ రకంగా చూసినా చెల్లదు. అందుకే అన్ని వర్గాల నుంచీ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కోర్టులకెళ్లే హక్కు ఎవరికైనా ఉంటుంది. కోర్టులు చెప్పేవి చెబుతాయి. సుప్రీం విచారణ రేపో మాపో అంటున్నారు. నిరసనలతోనైనా ప్రభుత్వం విజ్ఞతతో జిఓను ఉపసంహరించుకోవాల్సింది. పాలకులకు పట్టువిడుపులు అవసరం.