Jul 13,2023 10:57

ప్రజాశక్తి - వేంపల్లె : అప్పుల బాధతో మృతి చెందిన రైతు కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని పులివెందుల ఇన్ ఛార్జ్ బిటెక్ రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి, పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డిలు కోరారు. వేంపల్లె ఆసుపత్రిలో ఉన్న రైతు ఎద్దుల సాంబశివారెడ్డి మృతదేహాన్ని టిడిపి ఇన్ చార్జ్ బిటెక్ రవీంద్రనాథ్ రెడ్డి, పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డిలు సందర్శించారు. అలాగే రైతు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను మృతున్ని తండ్రి నారాయణ రెడ్డిని, బంధువులను ఆడిగి తెలుసుకున్నారు. అప్పులు ఉన్నప్పటికీ రైతులు ఆత్మ స్థైర్యంతో ఉండాలని కోరారు. ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల కుటుంబ సభ్యుల పరిస్థితిని కూడ ఆలోచించాలని సూచించారు. రైతు సాంబశివారెడ్డి ఆత్మహత్య చేసుకోవడం చాల బాధకరమని చెప్పారు. రైతు కుమార్తెలైన ఇద్దరు చిన్నారులను చూస్తుంటే చాల బాధేస్తున్నదని తెలిపారు. మనో ధైర్యంగా ఉండాలని మృతున్ని తండ్రి నారాయణ రెడ్డిని వారు ఓదార్చారు. ప్రభుత్వం కూడ ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు సకాలంలో పరిహరం మంజూరు చేయాలని కోరారు. రైతులు సాగు చేసిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను ఆదుకోవాలని కోరారు. రైతు మృతదేహాన్ని సందర్శించిన వారిలో టిడిపి మండల కన్వీనర్ రామమునిరెడ్డి, టిడిపి ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ షబ్బీర్, మైనార్టీ మండల కన్వీనర్ తెలంగాణ వలి, గోగుల మల్లికార్జున, జబిబుల్లా, డక్కా రమేష్, వెంకటయ్య, పాపిరెడ్డి, బాలస్వామిరెడ్డి, గొటూరు నాగభూషణం, ఈశ్వరయ్య, రామచంద్రారెడ్డితో పాటు పలువురు ఉన్నారు.