Oct 22,2023 12:07

ప్రజాశక్తి-వైయస్సార్ కడప జిల్లా : కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆదాయ పన్ను శాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. నాలుగు రోజులుగా ప్రముఖ బంగారం వ్యాపారుల దుకాణాల్లో తనిఖీలు చేస్తున్న సంగతి విదితమే. బుశెట్టి జువెలర్స్, డైమండ్స్ దుకాణాలలో పాటు తల్లం, గురురాఘవేంద్ర జువెలర్స్ లో అధికారులు తనిఖీలు చేపట్టారు. బంగారం వ్యాపారంలో ప్రొద్దుటూరు రెండో ముంబయిగా ఖ్యాతి గడించింది. దీంతో భారీగా అక్రమ బంగారం దిగుమతి అవుతోందన్న పక్కా సమాచారంతో అధికారుల నాలుగు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. భారీ అక్రమ బంగారం నిల్వలతో పాటు డబ్బును అధికారులు గుర్తించినట్లు సమాచారం. పొరుగు ప్రాంతాల నుంచి బిల్లులు లేకుండా బంగారం దిగుమతి చేసుకున్నట్లు అధికారులు  గుర్తించారు. ప్రొద్దుటూరులో రెండు వేలకు పైగా స్వర్ణ కారుల దుకాణాలు ఉన్నాయి. ఐటి అధికారుల తనిఖీలతో మిగతా బంగారం వ్యాపారుల్లో ఆందోళన  మొదలైంది. తనిఖీలు తమ వరకు వస్తాయన్న భయంతో బంగారం దుకాణాలు మూసివేశారు. దసరా పండుగ సమయంలో బంగారం దుకాణాలన్నీ మూత పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.