May 19,2023 16:19

ప్రజాశక్తి-కాకినాడ : మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బిజెపి పార్లమెంటు సభ్యుడైన బ్రిడ్జ్ భూషణ్ చరణ్ సింగ్ ను తక్షణం అరెస్టు చేయాలని కోరుతూ డిస్ట్రిక్ట్ స్పోర్ట్ అథారిటీ గ్రౌండ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ మాట్లాడుతూ గత నెల రోజులుగా మహిళా మల్లయోధులపై జరిగిన లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న మహిళా రెజ్లర్లకు క్రేడకారులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేసారు. హత్య, అత్యాచారం, కిడ్నాప్ వంటి 39 కేసుల్లో నిందితుడిగా ఉన్న బిజెపి ఎంపీ, రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు బ్రిడ్జిభూషణ్ చరణ్ సింగ్ ను తక్షణం అన్ని అధికార రాజకీయ పదవుల నుండి తొలగించి, సుప్రీంకోర్టు లేదా హై కోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న రెజ్లర్ల శిబిరం వద్ద విద్యుత్తు పంపిణీ, మంచినీటి సరఫరాను పునరుద్ధరించాలని, ఆందోళనకారుల పట్ల అసభ్యంగా, ఆమానుషంగా వ్యవహరించిన ఢిల్లీ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెడల్స్ సాధించినప్పుడు ఇంటికి పిలిచి మరి ఆతిథ్యం ఇచ్చిన ప్రధానమంత్రి నేడు రెజ్లర్ల సమస్య పట్ల మౌనం వహించడానికి తప్పు పట్టారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం క్రిమినల్ రాజకీయ నాయకుడైన బ్రిడ్జ్ భూషణ్ అరాచకాలపట్ల బిజెపి నాయకత్వం మౌనం వహిస్తుందని విమర్శించారు. గతంలో అసిఫా అత్యాచారం, హత్య సందర్భంగా, ఉన్నావ్ దళిత మహిళ అత్యాచార ఘటన సందర్బంగా బీజేపీ నాయకులు ముద్దాయిల పక్షం వహించారని గుర్తుచేసారు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్ అథారిటీ గ్రౌండ్ ముందు గురువారం, శుక్రవారం మల్లయోధులకు మద్దతుగా నిర్వహించిన ఆందోళనా కార్యక్రమాలకు సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జి, అంగన్వాడీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుబండి చంద్రవతి, కోశాధికారి రమణమ్మ, చామంతి, జ్యోతి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు నర్ల ఈశ్వరి, చెక్కల వేణి, సీఐటీయూ నగర అధ్యక్షులు పలివేల వీరబాబు, స్పోర్ట్స్ అధికారులు, ఉద్యోగులు, కోచ్ లు , వివిధ క్రీడాకారులు తదితరులు మద్దతు తెలిపారు.