ప్రజాశక్తి - కర్నూలు క్రైం : జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంపును సద్వినియోగం చేసుకుని క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని కర్నూలు ఎమ్మెల్యే ఎం.ఎ.హఫీజ్ ఖాన్ సూచించారు. బుధవారం స్థానిక వీకర్ సెక్షన్ కాలనీలోని ప్రజాశక్తి ఎడిషన్ కార్యాలయ ప్రాంగణంలో తైక్వాండో కోచ్ జి.షబ్బీర్ హుసేన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తైక్వాండో సమ్మర్ కోచింగ్ క్యాంపును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ నైపుణ్యాన్ని వివిధ స్టంట్‌ల ద్వారా ప్రదర్శించారు.ప్రజాశక్తి ఎడిషన్ ఇన్‌ఛార్జీ పానుగంటి చంద్రయ్య అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమాన్ని ఉద్ధేశించి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ వేసవిలో విద్యార్థులు సమయం వృధా కాకుండా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో వివిధ క్రీడల్లో సమ్మర్ కోచింగ్ క్యాంపులను నిర్వహించడం శుభపరిణామమని పేర్కొన్నారు. టైక్వాండో శరీర ధారుడ్యానికి, మానసిక ఉల్లాసానికి, ఆత్మ రక్షణకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వేసవిలో క్రీడాకారుల క్రీడలను మరింత దగ్గరగా పరిచయం చేయడం కోసం వైసిపి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుందన్నారు. విద్యార్థులు యువత క్రీడల్లో రాణించాలన్నారు. టైక్వాండో కోసం అవసరమైన ప్రత్యేక మ్యాట్లను కూడా ప్రభుత్వం మంజూరు చేసిందని త్వరలోనే వాటిని కూడా పంపిణీ చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ క్యాంపునకు పిల్లలను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను, కోచ్ షబ్బీర్ హుసేన్‌ను ఆయన అభినందించారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సిఇఒ పివి.రమణ మాట్లాడుతూ... జిల్లా వ్యాప్తంగా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో 50 సమ్మర్ కోచింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో క్యాంపు నిర్వహణకు రూ.7 వేలు కేటాయించినట్లు చెప్పారు. అందులో రూ.4,500 స్పోర్ట్స్ మెటీరియల్‌కు, రూ.2వేలు కోచ్ గౌరవవేతనానికి, మిగిలిన మొత్తాన్ని సర్టిఫికేట్ల కోసం కేటాయించినట్లు పేర్కొన్నారు. వేసవిలో పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డి, డివిఎంసి సభ్యులు ప్రభుదాసు, వైసిపి 47 వార్డు ఇన్‌ఛార్జీ స్వేతారెడ్డి, జర్నలిస్టు మునిస్వామి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గన్నారు.










