ప్రజాశక్తి - పెద్దాపురం : పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మే 7వ తేదీ నుండి జూన్ 15 వ తేదీ వరకు చదువుకునే బాలలకు నిర్వహించే సమ్మర్ క్యాంపు గోడ పత్రికను గురువారం ఆవిష్కరించారు. స్థానిక వరహాలయ్యపేటలోని యాసలపు సూర్యారావు భవనంలో సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ జోష్యుల కృష్ణబాబు అధ్యక్షతన జరిగిన సభలో మన పెద్దాపురం ఫేస్బుక్ అడ్మిన్ పెదిరెడ్డి నరేష్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. అనంతరం జనవిజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి బుద్ధా శ్రీనివాస్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో బాలలకు వినోదంతో పాటు విజ్ఞానం, వికాసం పెంపొందించేందుకు ఈ క్యాంపు నిర్వహించబడుతుందన్నారు. గత ఏడాది ఎంతో విజయవంతంగా ఈ క్యాంపును నిర్వహించారన్నారు. ఈ ఏడాది కూడా అందరి సహకారంతో ఈ క్యాంపుని విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. ఈ క్యాంపులో సైన్స్ ప్రయోగాలు, మ్యాథ్స్, సెల్ఫ్ డిఫెన్స్, కార్టూన్స్, ఇంగ్లీషు, చిత్రలేఖనం తదితర అంశాలపై బాలలకు శిక్షణ ఇస్తారన్నారు. మే నెల 5వ తేదీలోగా తల్లిదండ్రులు తమ పిల్లల పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. మిగిలిన వివరాలకు 9441709187, 7901697939 ఫోన్ నెంబర్లను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చన్నారు.










