Oct 15,2023 07:17

సుహానీ షా మనదేశానికి చెందిన తొలి మహిళా ఇంద్రజాలికురాలు. అంతేకాదు ఆమె హిప్నోథెరపిస్ట్‌.. రచయిత్రి. ఆమె తన నైపుణ్యంతో చాలా మందిని హిప్నటైజ్‌ చేశారు. మహిళా మెంటలిస్ట్‌ సుహానీ షా.. తొలి భారతీయ మహిళా మెంటలిస్ట్‌గా పేరొందారు. ఎదుటి మనిషి మనసును పుస్తకంలా చదివేయడం మెంటలిస్ట్‌ల ప్రత్యేకత. ఇందులో మేజిక్‌ కూడా కలగలిసి ఉంటుంది. ఐదేళ్ల వయసులో సుహానీ తన తండ్రితో కలిసి సొంతూరు ఉదరుపూర్‌లో ఓ మ్యాజిక్‌ షోకు వెళ్లారు. ఇంటికి రాగానే.. తానూ ఇంద్రజాలికురాలిని అవుతానని ప్రకటించారు. తల్లిదండ్రులూ ఆమె ఆసక్తిని ప్రోత్సహించారు. దాంతో సుహానీ తన చదువును హైస్కూల్‌ స్థాయిలోనే ఆపేసి.. దేశమంతా తిరిగి ప్రదర్శనలు ఇచ్చారు. 'అరవైమంది విద్యార్థులలో ఒకదానిగా క్లాస్‌రూమ్‌లో కూర్చోవాల్సిన వయసులో.. అరవైవేల మంది వీక్షకులకు వినోదాన్ని పంచాను' అని గర్వంగా చెప్పుకుంటోంది సుహానీ.

  • బాల్యం..విద్యాభ్యాసం..

సుహానీ షా 29 జనవరి, 1990న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జన్మించారు. తండ్రి పేరు చంద్రకాంత్‌ షా ఫిట్‌నెస్‌ కాన్సంట్రేటర్‌, ట్రైనర్‌. ఆమె తల్లి పేరు స్నేహలతా షా హౌస్‌మేకర్‌. సుహానీషాకు ఒక సోదరుడు ఉన్నారు. సుహానీ షా పుట్టిన తర్వాత కుటుంబం మొత్తం రాజస్థాన్‌ నుండి గుజరాత్‌కి మారింది. సుహానీ షా బాల్యమంతా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోనే గడిచింది. ఆమె ప్రాథమిక విద్య అక్కడే అడవుల్లో ప్రారంభమైంది. ఈ విషయాన్ని చాలాసార్లు సుహానీ షా స్వయంగా చెప్పారు. తను ఎలాంటి చదువులు చదవలేదని, ఇంట్లోనే ఎక్కువగా చదివిందనీ చెప్తుండేవారు. దీనికి కారణం సుహానీ షా ఇంద్రజాల కళను ప్రేమించడమే. అది నేర్చుకోవడంపైనే ఆమె దృష్టినంతా కేంద్రీకరించారు. రెండేళ్లు నేర్చుకున్న తర్వాత, సుహానీ షా తన మొదటి మ్యాజిక్‌ షోను ఏడేళ్ల ప్రాయంలో తన పుట్టినరోజున ప్రదర్శించారు. ఆ పరుగులో పడిపోయి ఇంగ్లీష్‌ మీద ధ్యాస పెట్టలేదన్నారు. తన పరిధిని విస్తరించుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆ కొరత తెలిసి, వెంటనే ఇంగ్లీష్‌, గణితం, సైన్స్‌ మీద దృష్టి పెట్టారు.

  • నా దారి నేనే నిర్మించుకున్నా..

'ఏ మెంటలిస్ట్‌ అయినా ఎదుటి మనిషి ఆలోచనల్ని పూర్తిగా చదవలేరు. కొంతమేర తెలుసుకుంటారు. దానికి సైకాలజీ జోడిస్తారు.. ఇంద్రజాలాన్ని కలగలుపుతారు. ప్రేక్షకులను అబ్బురానికి గురి చేస్తారు. ఈ పురుషాధిక్య ప్రపంచంలో మహిళా మెంటలిస్ట్‌గా, మెజీషియన్‌గా నా ప్రయాణం ఏమంత సాఫీగా సాగలేదు. నాకు గైడ్‌గా, మెంటర్‌గా ఉండటానికి ఏ పురుషుడూ ముందుకు రాలేదు. కారణం.. ఓ అమ్మాయిని తమంత ఎత్తుకు తీసుకెళ్లడం ఏ పురుషుడికీ ఇష్టం ఉండదు. అందుకే, నా దారి నేనే నిర్మించుకున్నాను' అంటారు సుహానీ. సుహానీ షా 5000 కంటే ఎక్కువ షోలు ప్రదర్శించారు. రచయిత్రిగా 'అన్లీష్‌ యువర్‌ హిడెన్‌ పవర్‌, యువర్‌ హాస్పిటల్‌ బ్యాగ్‌, విజిట్‌ బారు ది మ్యూజియం: ఎ కలెక్షన్‌ ఆఫ్‌ పోయెమ్స్‌'తో సహా అనేక పుస్తకాలను రచించి, ప్రచురించారు.
సుహానీ తన ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పేందుకు 2007లో యూట్యూబ్‌ ఛానెల్‌ని క్రియేట్‌ చేశారు. అయితే 2009లోనే ఈ ఛానెల్‌లో తన తొలి వీడియోను పెట్టారు. ప్రారంభంలో వీడియోలను చాలా మంది చూసేవారు కాదు. కానీ కొంత సమయం తరువాత, సుహానీ ఛానెల్‌కు వీక్షకుల నుండి విశేషంగా సభ్యత్వం, లైక్‌లను పొందడం ప్రారంభమైంది. నేడు ఆమె ఛానెల్‌కు మూడు మిలియన్ల కంటే ఎక్కువ మంది సభ్యులున్నారు.