అనాదిగా అంటున్న వ్యాఖ్యలే అవి
మా నుదుళ్లపై మొలకెత్తిన
రాతలున్నవి ఇప్పుడు
కొత్తగా మా దేహాన్ని సాగు చేసుకున్నాం
లోపలి గదుల్లోని కలుపును ఏరి
ముత్యాల్లాంటి గింజలు నాటుకున్నాం
ఎద లోతుల్లోంచి చీల్చుకొని
కొంగొత్త మొలకలు విప్పారుతూ వస్తాయి
మనుషుల ప్రపంచం ఇది
దేన్నయినా వంచగలరు
ఏదైనా సృష్టించగలరు
మా చిరుప్రాణాల వ్యథలు
ఏ కంటికి కనిపిస్తాయి
ఏ హస్తమో చాచి మా వైపుకు
మసకగా అందదు
అలవాట్ల పొరపాట్ల వైఖరి
లెక్క చేస్తుందా
అయినా పచ్చికలో ఆడుకుంటాం
ఎవరిపై సాధింపు ఆలోచనలు
మా దరిచేరవు
అలా ఒడ్డున సూర్యాస్తమయాలను
గమనిస్తూ ఉంటాం వెచ్చగా
మట్టి దుప్పటి కప్పుకుని చూస్తాం పైకి వినే కొన్ని నక్షత్రాలు ఉంటాయి
మిణుకు మిణుకుమంటూ
మా వైపు
చూస్తుంటాయి అదేపనిగా
అందని సాయం
అల్లంత దూరం
కళ్లు కొడుతూ మొహం
ఖగోళంలోకి వెళుతుంటుంది
రాత్రిని దిగమింగుతూ
అతి కష్టం మీద
కాయం విశ్వమై అనుభవిస్తది అందరివీ
అటువైపు నుంచి
ఇటువైపు నుంచి
అప్పుడు అన్నీ నా నుంచేనా అనిపిస్తది
అంతా నాలోనే ఇమిడి ఉంది
చర్యకు ప్రతిచర్య
సమాంతర చర్య
విరుద్ధ చర్య అచర్య
నాలోనే ఎన్నో వ్యతిరేకాలు ప్రవహిస్తున్నాయి
నా నుంచే ఆ ధ్వనులు పుడుతున్నవి
ముందు నాలోనే జరగాలి
'శుద్ధి' నిజంగా!
రఘు వగ్గు
96032 45215