ప్రజాశక్తి-ఆదోని : సీపీఎస్ రద్దుకు జిపిఎస్ ప్రత్యామ్నాయం కాదని, పాత పెన్షన్ విధానం కావాలని ఎస్‌టీయు రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని ఎస్టీయు ప్రాంతీయ కార్యాలయంలో 77వ ఎస్‌టీయు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదోని డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి నాగరాజు ఎస్‌టీయు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడారు. స్వయం పోరాటాలు, ఐక్య ఉద్యమాలకు సంపూర్ణ మద్దతు ఇస్తూ విద్యారంగ, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై అవిరళ కృషి చేస్తున్న ఏకైక ఉపాధ్యాయ సంఘం ఎస్‌టీయు అని కొనియాడారు. ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ (ఓపిఎస్) విధానాన్ని పునఃరుద్దరించాలన్నారు. సీపీఎస్‌ని కొన్ని రాష్ట్రాలు రద్దు చేసినపుడు మన ఏపీకు ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌టీయు నాయకులు వీరచంద్ర యాదవ్, సుంకన్న, రామంజి, మహాదేవప్ప, గోపాల్, సత్య, రామకృష్ణ, రామప్ప, వెంకటేశ్వర్లు, అంజి పాల్గొన్నారు.










