- అడ్డుకున్న రెవెన్యూ, పోలీసు యంత్రాంగం
ప్రజాశక్తి-రెడ్డిగూడెం : మండల పరిధిలోని కుదప రెవెన్యూ పరిధిలోని ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా చేపల చెరువు త్రవ్వకాలు సాగుతున్నాయి. వివరాల్లోకి వెళితే రెడ్డిగూడెం మండలం, కుదప గ్రామ రెవెన్యూ పరిధిలోని ఓబులాపురం గ్రామం నాగసానిపాటి వారి చెరువుకు వెళ్లే సప్లై ఛానల్ ను ఆనుకొని ఉన్న సర్వే నెంబరు 449/1 లో ఉయ్యూరు అంజిరెడ్డి కి చెందిన సుమారు 9.41 ఎకరాల వరి మాగాణి భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా చేపల చెరువు త్రవ్వకాలు సాగుతున్నాయి. ఈ చేపల చెరువు త్రవ్వడం వలన ఓబులాపురం నాగసానిపాటి చెరువుకు నీళ్లు వెళ్లడం ప్రశ్నాకమౌంతుంది. భవిష్యత్తులో ఆ చెరువు కింద ఆయకట్టు వరి పోలాలకు నీటి ఎద్దడి వచ్చి పంటలు నష్టపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో పంచాయతీలు అనుమతులు మంజూరు చేయలేదు. ఈ సర్వే నెంబరులో చేపల చెరువు త్రవ్వకాలు చేయకూడదని పలుమార్లు అధికారులు సూచించారు. గతంలో ఈ ప్రాంతంలో అనుమతి లేకుండా చేపల చెరువు తవ్వుతుంటే రెవెన్యూ అధికారులు అడ్డుకుని హెచ్చరించారు. దాంతో తాత్కాలికంగా చెరువు త్రవ్వకాలు ఆపేశారు. కానీ రెవెన్యూ అధికారుల హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా గత నాలుగు రోజులుగా రాత్రి వేళల్లో రెండు ప్రొక్లయిన్ లతో చేపల చెరువు త్రవ్వకాలు సాగుతున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అధికారులు పోలీసు సిబ్బందితో వెళ్లి అక్రమంగా తవ్వుతున్న చేపల చెరువు త్రవ్వకాలు అడ్డుకుని ప్రొక్లయిన్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- అనుమతులు లేకుండా చెరువులు తవ్వితే కఠిన చర్యలు : తహసీల్దార్ యం పాల్.
మండలంలో చేపల చెరువుల తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని ఎవరైనా సరే అనుమతులు లేకుండా అక్రమ చేపల చెరువు త్రవ్వకాలు చేపడితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.










