
బలిదానాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కార్పొరేట్ల పాలు కానివ్వకూడదన్న దృఢ సంకల్పంతో కార్మికవర్గం రెండేళ్లుగా పోరాటాన్ని కొనసాగించడం శ్లాఘనీయం. 'ఎవ్వడురా అమ్మేది... ఎవ్వడురా కొనేది...' 'విశాఖ ఉక్కు... ఆంధ్రుల హక్కు... కేంద్రం సొత్తు కాదు...' అంటూ విశాఖ కేంద్రంగా సాగుతున్న నినాదాల మోత రాష్ట్రవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూ... కేంద్రంలోని మోడీ సర్కారును నిలేస్తోంది. ప్రభుత్వ రంగాన్ని గంపగుత్తగా కార్పొరేట్లకు కట్టబెట్టడమో... మూసివేయడమో విధానంగా సాగుతున్న మోడీ సర్కారు ఏలుబడిలో ఒక ప్రభుత్వ రంగ సంస్థను అమ్మనివ్వబోమంటూ ఇంతకాలం పాటు సాగిన పోరాటంగా విశాఖ ఉక్కు ఇప్పటికే ప్రత్యేక చరిత్రను లిఖించింది. విశాఖ ఉక్కు పరిశ్రమ వస్తే ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయని, తమ బతుకులు బాగుపడతాయన్న సంకల్పంతో సాగిన పోరాటంలో... 1966లో 32 మంది ప్రాణత్యాగం చేశారు. 16 వేల మంది నిర్వాసితులు 22 వేల ఎకరాలను అతి చౌకగా కర్మాగారానికి ఇచ్చారు. ఎట్టకేలకు 1990లో ప్రారంభమైన పరిశ్రమ 2021-22 నాటికి వార్షిక టర్నోవర్ రూ.20 వేల కోట్లు, ఆ ఏడాది నికర లాభం రూ.945 కోట్లు సాధించింది. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న విపత్కర సమయంలో ఆక్సిజన్ సరఫరా చేసి, 'ఉక్కు కాదు.. ఊపిరి' అని నిరూపించుకుంది.
ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రగతిపథంలో పరిశ్రమను నడిపిన చరిత్ర, అనుభవం ఇక్కడి కార్మిక వర్గానికి, ఉద్యమ శక్తులకు ఉంది. దేశంలోని అన్ని ప్రభుత్వరంగ, ప్రైవేటు స్టీల్‌ప్లాంట్లకు సొంత గనులున్నా... అవి లేని ఏకైక పరిశ్రమ ఇది ఒక్కటే. అందువల్ల ఏటా సుమారు రెండు వేల కోట్లు అదనంగా విశాఖ స్టీల్ ఖర్చు చేయాల్సి వస్తోంది. విశాఖ ఉక్కుకు తక్షణమే సొంత ఇనుప గనిని మంజూరు చేయాలి. ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.58 వేల కోట్లు పన్నులు, డివిడెండ్ల పేరుతో ఈ పరిశ్రమ చెల్లించింది. ప్రభుత్వరంగంలో నడిస్తే కార్పొరేట్ సంస్థలకు భిన్నంగా... భవిష్యత్తులోనూ మరిన్ని వేలు, లక్షల కోట్ల రూపాయలు చెల్లించే అవకాశముంది. అప్పులు ఎగ్టొట్టిన బడా పెట్టుబడిదారులకు రూ.10 లక్షల కోట్లు రుణమాఫీ చేసిన కేంద్రం స్టీల్‌ప్లాంట్‌కున్న రుణాలు సుమారు రూ.30 వేల కోట్లను వెంటనే రద్దుచేయాలి. ప్రైవేటు పరిశ్రమల లాభాల కోసం విశాఖ ఉక్కును సామర్ధ్యం మేరకు నడపకుండా అడ్టంపడే విధానాలకు కేంద్రం స్వస్తి చెప్పాలి. ప్లాంట్‌ను ప్రైవేట్‌కు అమ్మాలని కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికైనా వెనక్కితీసుకోవాలి. విశాఖ ఉక్కుపై కేంద్రానికి ఎలాంటి హక్కు లేదని, ఉద్యమానికి రాష్ట్రప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని సిఎం మాటగా చెబుతున్నానని సోమవారం జరిగిన భారీ బహిరంగ సభలో రాష్ట్ర మంత్రి ప్రకటించారు. అయితే, అది ఆచరణ రూపం దాల్చాలి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర ఎంపిలందరిని కూడగట్టి, బిజెపియేతర పార్టీల సహకారం కూడా తీసుకొని 'ఉక్కు'పై కేంద్రం వైఖరి వెనక్కి తీసుకునేలా ఒత్తిడి నిర్మించాలి. అందుకు చొరవ తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వము, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీనే! వామపక్ష పార్టీలు అన్ని దశల్లోనూ ఈ పోరాటంలో ముందుంటున్నాయి. తెలుగుదేశం కూడా ఉద్యమంలో భాగస్వామి కావాలి. అందరూ ఏకమై కేంద్రం మెడలు వంచాలి. ప్రజా పోరాటాలతో ప్లాంట్‌ను సాధించినట్లుగానే... ప్రైవేటీకరణపై అంతిమ విజయాన్ని సాధించాలి. పోస్కోకు, ఎల్‌ఐసి, బ్యాంకుల సొమ్ము కొల్లగొట్టి దేశ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్న అదానీకి ప్లాంట్‌తోపాటు లక్షల కోట్ల రూపాయల విలువైన 22 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్‌ను కట్టబెట్టాలని చూస్తున్న మోడీ సర్కారు యత్నాలను తిప్పికొట్టాలి. తెలుగు ప్రజల ఆత్మగౌరవ చిహ్నంగా ప్లాంట్‌ను ప్రభుత్వరంగంలోనే కాపాడుకోవాలి. ప్రతి దశలోనూ ప్రజా చైతన్యం వెల్లువెత్తడం.. నిరంకుశ పోకడలను తిప్పికొట్టడం ఈ పరిశ్రమ ప్రత్యేకత. తెలుగుగడ్డపై విశాఖ ఉక్కు పోరాటం... మొక్కవోని దీక్షకు... ప్రజా ఉద్యమ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిపోతుంది.