కొలంబొ : ఒకవైపు ఎండ మండిపోతున్న తమిళ కార్మికుడు సూసయ్యముత్తు (44) కౌలుకి తీసుకున్న పొలంలో వేరుశనగ పంటను కాపాడుకునేందుకు యత్నిస్తున్నాడు. దేశంలో పెరిగిపోయిన ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి తన రోజువారీ పోరాటాన్ని సాగిస్తున్నాడు. అయితే రోజువారీ వేతన కార్మికుడిగా ఇప్పటికన్నా అధిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు ఆయన తెలిపారు.
2009లో జరిగిన వైమానిక దాడిలో రెండు కాళ్లను పోగుట్టుకున్న అతను అరచేతులపైనే తిరుగుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శ్రీలంక ప్రభుత్వానికి, ఎల్‌టిటిఇ మిలిటెంట్ సంస్థకు మధ్య 26 ఏళ్ల పాటు జరిగిన యుద్ధం సమయంలో అతను కాళ్లను కోల్పోయాడు. యుద్ధం తర్వాత ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం సూసయ్యముత్తు వంటి వారి నెత్తిన మరో పిడుగు పడినట్లైంది. ఆర్థిక సంక్షోభానికి ముందు అతను చేపల వేటకు వెళ్లేవాడు. ఇంధన ధరలు పెరిగిపోవడంతో ప్రస్తుతం వేరుశనగ పంట ద్వారా జీవనోపాధి పొందేందుకు యత్నిస్తున్నాడు. నిత్యావసరాల ధరలు తగ్గితే కొంతమేరకు ఉపశమనం కలుగుతుందని అన్నారు. ధరలు కొండెక్కడంతో ఈ ఆదాయం తమ ఖర్చుల్లో 10 శాతాన్ని మాత్రమే తీర్చగలుగుతుందని అన్నారు.
తమిళులు అధికంగా నివసించే ఉత్తర తీరప్రాంతజిల్లా ముల్లెతీవులో సూసయ్యముత్తు నివసిస్తున్నారు. ఆ జిల్లాలో నివసించే వారంతా రోజువారీ కూలీలు. శ్రీలంకలోని రెండో పేదరికపు జిల్లాగా ఉన్న ముల్లెతీవులో 58 శాతం మంది తీవ్రమైన పేదరికంలో జీవిస్తున్నారని సేవ్ ద చిల్డ్రన్ సర్వే ప్రకటించింది. సంక్షోభం కారణంగా వారిలో మూడు శాతం మంది ఆదాయాన్ని కోల్పోయారని వెల్లడించింది.
ఆహార ద్రవ్యోల్బణం గత నెలలో 93.7 శాతానికి చేరుకోవడంతో.. 6.2 మిలియన్ల మంది శ్రీలంక పౌరులు ఆహార భద్రతను కోల్పోయారని ఐక్యరాజ్యసమితి సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎఒ) ప్రకటించిన సంగతి తెలిసిందే. వారిలో అతని కుటుంబం కూడా ఉంది. దేశవ్యాప్తంగా 31శాతం మంది పెద్ద వయసు వారు సూసయ్యముత్తులాగా తమ పిల్లల ఆకలి తీర్చేందుకు ఆహారం తీసుకోవడం లేదని తెలిపింది. సంక్షోభంతో వారు అధ్వాన్న పరిస్థితుల్లోకి చేరుకున్నారని ఎన్‌జివో సంస్థకు చెందిన సోమనాథన్ తెలిపారు. యుద్ధం అనంతరం ఈ సంక్షోభంతో మరింత తీవ్ర పరిస్థితుల్లోకి జారుకున్నారని అన్నారు.
సంక్షోభంలో తీవ్రంగా దెబ్బతిన్న కుటుంబాలకు శ్రీలంక 4 మిలియన్ల గృహాలను అందించే సంక్షేమ పథకాన్ని చేపట్టిందని, మరో ఆరు లక్షల మందికి నేరుగా నెలవారీ నగదు బదిలీ పథకాన్ని అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు సామాజిక సాధికారిత మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీల్ హపుహిన్నే తెలిపారు. ఈ ఏడాది 3.2 మిలియన్ల కుటుంబాలకు రూ. 51.3 బిలియన్లు పంపిణీ చేస్తామని.. అనంతరం అర్హులైన వారిని గుర్తించి సహాయం అందిస్తామని చెప్పారు. ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎడిబి) నుండి 200 మిలియన్ డాలర్ల రుణం కూడా అందిస్తోందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా సాయం కోసం ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్యసమితిలను ఆశ్రయించిందని అన్నారు.










