హవానా : వాషింగ్టన్‌లోని క్యూబా దౌత్య కార్యాలయంపై ఆదివారం సాయంత్రం జరిగిన దాడిని పలు దేశాలు ఖండించాయి. ఈ విషయంలో క్యూబాకు అవి పూర్తి సంఘీభావం తెలియజేశాయి. చివరికి ఈ దాడికి పరోక్షంగా కారణమైన అమెరికా కూడా ఖండించక తప్పని స్థితి ఏర్పడింది. సోమవారం అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్ మాట్లాడుతూ, వాషింగ్టన్‌లోని క్యూబా ఎంబసీపై దాడిని ఖండిస్తున్నామని చెప్పారు. సకాలంలో, సముచితమైన దర్యాప్తు చేపట్టేందుకు వీలుగా క్యూబా ఎంబసీ అధికారులతో, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నామని తెలిపారు. వాషింగ్టన్ డిసి పోలీసులతో కలసి దర్యాప్తును సమన్వయం చేసుకుంటామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాధ్యూ మిల్లర్ తెలిపారు.
ఇంతవరకు ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదని అమెరికా సీక్రెట్ సర్వీస్ తెలిపింది. సాధ్యమైనంత త్వరగా ఈ కేసు దర్యాప్తును ముగించి, బాధ్యులెవరో తేల్చి చర్యలు తీసుకోవాలని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ అమెరికాను కోరారు. లెబనాన్ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి హన్నా ఘరీబ్ ఈ దాడిని ఖండించారు. విముక్తి చిహ్నంగా క్యూబాకు తమ మద్దతు ఎప్పుడూ వుంటుందని ఆయన ఉద్ఘాటించారు. విదేశీ ఎంబసీని రక్షించడంలో అమెరికా విఫలమైందని స్వీడిష్-క్యూబన్ సంఘీభావ సమాఖ్య విమర్శించింది. ఈ నేరానికి ఎవరూ శిక్ష పడకుండా తప్పించుకోరాదని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జకరోవా వ్యాఖ్యానించారు. ఈ దాడికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.