Jun 25,2023 07:15

             'మొదట వారు కమ్యూనిస్టుల కోసం వచ్చారు, నేను మాట్లాడలేదు/ ఎందుకంటే నేను కమ్యూనిస్టును కాదు/ తర్వాత వారు సోషలిస్టుల కోసం వచ్చారు, నేను మాట్లాడలేదు/ ఎందుకంటే నేను సోషలిస్టును కాదు/ అప్పుడు వారు ట్రేడ్‌ యూనియన్‌ వాదుల కోసం వచ్చారు, నేను మాట్లాడలేదు/ ఎందుకంటే నేను ట్రేడ్‌ యూనియన్‌ వాది కాదు/ అప్పుడు వారు యూదుల కోసం వచ్చారు, నేను మాట్లాడలేదు/ ఎందుకంటే నేను యూదుని కాదు/ ఇప్పుడు వారు నా కోసం వచ్చారు/ నా కోసం మాట్లాడటానికి ఎవరూ లేరు' అంటాడు మార్టిన్‌ నీమోల్లర్‌. హిట్లర్‌కు గట్టి మద్దతుదారుగా వున్న నీమోల్లర్‌... వారి భ్రమల నుంచి బయట పడిన తర్వాత, వారికి వ్యతిరేకంగా తన స్వరాన్ని పెంచాడు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో అసహనం, అన్యాయాలకు గురైన బాధితుల పక్షాన నిలిచి, వారిని సంఘటితం చేసేందుకు, వారిలో ఐక్యత పెంచేందుకు, వారికి సంఘీభావం తెలిపేందుకు పై కవితను రాశాడు. విభిన్న సంస్కృతులు, భావజాలాలు, ఆసక్తులతో వర్గీకరించబడిన సమాజంలో, సంఘీభావం సానుకూల మార్పుకు శక్తివంతమైన ఉత్ప్రేరకంగా నిలుస్తుంది. 'సంఘీభావం అనేది స్వచ్ఛందమైన పనికాదు. ఒక లక్ష్యం కోసం పోరాడే శక్తుల మధ్య పరస్పర సహాయం' అంటారు ప్రముఖ సోషలిస్ట్‌, మొజాంబిక్‌ దేశ మొదటి అధ్యక్షుడు సమోరా మాచెల్‌.
           అసమానత, అన్యాయాలకు గురవుతున్న సమాజంలో వ్యవస్థాగత సమస్యలను ఎదుర్కోవడానికి సంఘీభావం ఒక శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుంది. అణచివేత వ్యవస్థలు, నిరంకుశత్వం, వివక్షాపూరిత విధానాలను సవాలు చేయడానికి వ్యక్తులను, సంఘాలను ఇది ఉత్తేజపరుస్తుంది. అట్టడుగు వర్గాలకు సంఘీభావంగా నిలవడం ద్వారా సమానత్వం, న్యాయం కోరే ఐక్య వేదికలను సృష్టించవచ్చు. నిరంకుశ ధోరణులను ఎదుర్కోడానికి, అట్టడుగు వర్గాలకు న్యాయం చేయడానికి, వారి పురోగతికి అవసరమైన మార్గాలను రూపొందించడానికి బాట ఏర్పడుతుంది. నాటి వాల్‌స్ట్రీల్‌ ఉద్యమం నుంచి నిన్నామొన్నటి రైతు ఉద్యమం, రెజ్లర్ల ఉద్యమం వరకు నిరంకుశ విధానాలపై బిగించిన పిడికిళ్లు, గర్జించిన గళాలు ఉద్యమ కెరటాలయ్యాయి. ఒక్కరితో మొదలై... వేలాదిమందితో ఐక్యమై, సంఘటితమై సాధించిన విజయాలలో కీలకమైన విషయం. 'ఐక్యత బలమైన శక్తి : ఐక్యత లేని ప్రజలు శక్తిహీనులు' అంటాడు ఘనా దేశ మొదటి అధ్యక్షుడు, 1962లో లెనిన్‌ శాంతి బహుమతి గ్రహీత క్వామే న్క్రుమా.
          దశాబ్దాలుగా భూమితో, ఊరితో పెనవేసుకున్న అనుబంధం. నిద్ర లేచింది మొదలు... మళ్లీ నిద్రించే వరకు ఆ పల్లెతోనే వారి బతుకు, అడవిలోనే వారి జీవన ప్రయాణం. అలాంటి బతుకు బంధాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగం చేసిన పల్లె తల్లి బిడ్డలు వారు. తల్లి ఒడి నుంచి బలవంతంగా నెట్టబడిన నిర్వాసితులు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ మొదలు... వెలుగొండ, వంశధార వరకు నిర్వాసితుల కన్నీటిగాథలన్నీ ఒక్క రీతిగానే వున్నాయి. ఇప్పుడు పోలవరం నిర్వాసితులు కూడా ఆ జాబితాలో చేరారు. కాంట్రాక్టర్లకు వేల కోట్లు కట్టబెడుతున్న ప్రభుత్వాలు... నిర్వాసితులకు మొండిచెయ్యి చూపుతున్నాయి. కలలను, ఆశలను కలబోసి కట్టుకున్న సొంత ఇంటిని వదిలేలాచేసి... నిర్వాసితులుగా మార్చారు. కట్టెలు, తేనె, వెదురు, కూరగాయలు, పుట్టగొడుగులతో అమ్మలా ఆదుకుని బువ్వెట్టిన అడవితల్లికి దూరమై, సమీప పొలాల్లోకి వ్యవసాయ కూలీలుగా విసిరేయబడినోళ్లు కొందరైతే, పరిహారం కోసం ఎదురుచూస్తూ.. సొంతవూళ్లలోనే బిక్కుబిక్కుమంటున్నోళ్లు ఇంకొందరు. 'అట్టడుగున పడి కనిపించని/ కథలన్నీ కావాలిప్పుడు/ దాచేస్తే దాగని సత్యం' అంటాడు మహాకవి శ్రీశ్రీ. ఎవరికీ పట్టని నిర్వాసితుల కన్నీటి కథలన్నీ వెలుగులోకి తేవాలని, న్యాయం కోసం ఎదురుచూస్తున్న పోలవరం నిర్వాసితులకు తగిన పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాలను నిలదీస్తున్నది పోరుకేక. రోడ్డున పడిన నిర్వాసితులకు సంఘీభావంగా మొదలైంది పోరుయాత్ర. ఎరుపెక్కిన నిర్వాసితుల కన్నీళ్లు ప్రశ్నిస్తున్నాయి మా వెనుక మీరుండరా? అని. సంఘటితమై... సమైక్యమై... నేను సైతం అంటూ అడుగు వేద్దాం. మొదటి అడుగు ఒంటరే కావొచ్చు... నీ వెనుక వచ్చేవారికది బాట అవుతుంది.