Sep 25,2022 08:43

పచ్చని పైరే తన దేహం
సెలయేరుల స్వరఝరి దాని స్వరం
నీడనిచ్చి, ఫలమునిచ్చుట దాని నైజం
ఆకాశమే ఆత్మగా అణువణువు
నిండిన సొగసు దాని సొంతం !

జీవులకు జీవం పోసే గుణం
మరణంలోనూ తోడు వొచ్చే స్నేహం !
ఆత్మీయతలోని అమ్మతనం
ఆసరాగా తీసుకుంటున్న జనం!
అవసరాలకు ఆటబొమ్మగా మార్చిన వైనం
అడవితల్లి గర్భానికి మిగిలిన శోకం!

వాడుకోవటమేగానీ ఆదుకోవటం
మరిచిన మానవ మృగం !
నవీనతలో నవ్యతకు పట్టం కట్టి
కనిపించిన ప్రతిదీ బేరం పెట్టి
అగాధంలోకి తొక్కి
ఆయువు తీసి అతలాకుతలం చేశాడు!

ఆగ్రహించిన ప్రకృతి కాంత
నిప్పులు చెరుగుతూ, నాట్యం చేస్తూ
కన్నీటి దారులతో నగరాలను ఊడ్చేస్తూ
పరివర్తన కోరి ప్రకంపిస్తుంది
పర్యావరణ పరిరక్షణకి పరితపిస్తుంది!!


- జ్యోతి మువ్వల
90080 83344