ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సామాజిక ప్రగతి సూచిక (ఎస్‌పిఐ)లో రాష్ట్రంలో కడప జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.
రెండో స్థానంలో చిత్తూరు నిలువగా, చిట్టచివరన కర్నూలు జిల్లా నిలిచింది. ఈ మేరకు రూపొందించిన నివేదికను ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి విడుదల చేసింది. అయితే, ఐదు విభాగాలుగా రూపొందించిన ఈ నివేదికలో అత్యధిక ప్రగతి సాధించిన కేటగిరిలో తెలుగు రాష్ట్రాల నుండి ఒక్క జిల్లా కూడా లేదు. అధిక సామాజిక పురోగతి సాధించిన జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన రెండేసి జిల్లాలు ఉన్నాయి. అప్పర్ మిడిల్ విభాగంలో ఏపి, తెలంగాణకు చెందిన ఏడు జిల్లాలు, లోయర్ మిడిల్ కేటగిరిలో తెలంగాణనుండి 15, ఆంధ్రప్రదేశ్ నుండి నాలుగు జిల్లాలు ఉన్నాయి. తక్కువ సామాజిక పురోగతి సాధించిన జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ నుండి ఒకటి, తెలంగాణ నుండి ఏడు జిల్లాలు ఉన్నాయి. పౌష్టికాహారం, ప్రాథమిక వైద్య సంరక్షణ, త్రాగు నీరు, పారిశుద్ధ్యం, వ్యక్తిగత భద్రత, ఆశ్రయం, ప్రాథమిక విజ్ఞాన సదుపాయం, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ యాక్సెస్, ఆరోగ్యం, ప్రజా క్షేమం (హెల్త్ అండ్ వెల్నెస్), పర్యావరణ నాణ్యత, వ్యక్తిగత హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ, సమగ్రత, అధునాతన విద్య తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఈ నివేదికను రూపొందించినట్లు ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి తెలిపింది.
- జిల్లాల వారీగా ఇలా..
జిల్లా... పాయింట్లు
కడప 62.2
చిత్తూరు 61.0
విశాఖపట్నం 59.5
కృష్ణా 59.0
తూర్పు గోదావరి 58.9
నెల్లూరు 57.6
పశ్చిమ గోదావరి 57.4
శ్రీకాకుళం 56.8
గుంటురు 56.1
విజయనగరం 55.6
ప్రకాశం 54.4
అనంతపురం 52.9
కర్నూలు 51.1
పోషకాహారం, ప్రాథమిక వైద్య సంరక్షణ, మహిళలు, పిల్లల్లో రక్తహీనతపై పనితీరులో కేరళ అగ్రగామిగా నిలిచింది. కేరళ అత్యధికంగా 67.68 స్కోర్‌తో మొదటి స్థానంలో నిలిచింది. లక్షద్వీప్ 66.58 స్కోర్‌తో, సిక్కిం 65.57 స్కోర్‌తో రెండు, మూడు స్థానంల్లో ఉన్నాయి. బీహార్ ( 28.86 స్కోర్), ఉత్తరప్రదేశ్ (33.36 స్కోర్), జార్ఖండ్ (35.47 స్కోర్) కిందన ఉన్నాయి. మహిళల్లో రక్తహీనత ప్రాబల్యాన్ని తగ్గించడంలో కేరళ అధిక కాంపోనెంట్ స్కోర్ మెచ్చుకోదగిన పనితీరుకు కారణమని చెప్పవచ్చు. 6-59 నెలల వయస్సు గల పిల్లలలో రక్తహీనత విషయంలో దేశంలోనే అతి తక్కువ ప్రాబల్యం రేటు కేరళ సాధించింది. దేశంలోనే అత్యల్ప శిశు, పిల్లలు, ప్రసూతి మరణాల రేటులో కేరళ ఒకటిగా నిలిచింది. న్యూట్రిషన్, బేసిక్ మెడికల్ కేర్ కాంపోనెంట్‌లో 340 జిల్లాలు జాతీయ సగటు 38.59 కంటే ఎక్కువ స్కోర్ చేశాయి. ఇందులో కేరళకు చెందిన పతనంతిట్ట (63.09), కోజికోడ్ (62.21), తిరువంతపురం (62.03), అరుణాచల్ ప్రదేశ్‌కి చెందిన లాంగ్డింగ్ (62.92) అత్యధిక స్కోర్ చేసిన జిల్లాలుగా ఉన్నాయి. బీహార్‌కు చెందిన బంకా (18.57), లఖిసరారు (18.58) అత్యల్ప స్కోరును సాధించాయి.










