
అనగనగా ఒక ఊరిలో నీరజ, హిమజ అనే ఇద్దరు స్నేహితురాళ్లు ఉండేవారు. వాళ్ళు చాలా ఆనందంగా ఉండేవారు. వాళ్ళు చదువుతున్న పాఠశాలలో వర్షిణి అనే కొత్త అమ్మాయి చేరింది. ఆ అమ్మాయి ప్రవర్తన ఎవరికీ నచ్చేది కాదు. ఎందుకంటే తను చాడీలు చెప్పేది. ఆ అమ్మాయి హిమజ, నీరజలతో స్నేహం చేయడానికి ప్రయత్నించింది. తన చాడీలు చెప్పే గుణం ఇద్దరికీ తెలుసు. వాళ్ళిద్దరికీ లేనిపోని మాటలు చెప్పి వాళ్ళిద్దరినీ విడదీయాలని చూసింది. కానీ వాళ్ళు నమ్మలేదు. స్పర్థ పెంచుకోలేదు. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నారు.
ఒకరోజు ఇద్దరూ ఒకరినొకరు నువ్వేమవుతావని అడిగారు. నీరజ, హిమజ ఇద్దరూ బైపిసి తీసుకుని డాక్టరు చదవాలనే వారి కోరిక చెప్పుకున్నారు. మనిద్దరం మన స్నేహాన్ని విడకూడదని అనుకున్నారు.
వాళ్ళిద్దరూ డాక్టర్లు కావాలనే లక్ష్యంతో కష్టపడి చదివారు. వారి కోరిక నెరవేరేలా కృషి చేశారు. నీరజ చదువు మధ్యలోనే ఆమె తండ్రి చనిపోయారు. హిమజ వాళ్ళు ధనవంతులు కావడంతో నీరజ చదువుకు సహాయం చేసేలా తండ్రిని ఒప్పించింది.
ఇద్దరూ కష్టపడి చదివి మంచి డాక్టర్లుగానే కాక, మంచి కూతుర్లుగా కూడా పేరు పొందారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు. వాళ్లు మంచి డాక్టర్లుగా పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ సమాజానికి తమవంతు సహాయం చేస్తున్నారు. స్నేహ మాధుర్యాన్ని చవి చూస్తున్నారు.
రౌతు ప్రత్యూష
9వ తరగతి
జడ్‌పిహెచ్ ఎస్, మెట్టవలస
శ్రీకాకుళం జిల్లా