మామిడి పండు మధురం. మరి ఆ పండుతో చేసేవి మధురాతి మధురం. పరిమిత కాలమే లభ్యమయ్యే పండు మామిడి. వేసవికాలం నుంచి మరల వేసవి వరకు ఎదురుచూసేది మామిడిపండు కోసమే. జిహ్వ కోరినప్పుడు బుర్రలో పుట్టే ఆలోచనే కొత్త రుచులకు దారితీస్తుంది. అలా మామిడిపండుతో కొన్ని రుచులను తయారుచేయటం పూర్వం నుంచీ ఉంది. అవేకాక మరికొన్ని కొత్త రుచులు మార్కెట్‌లోకి వచ్చాయి. అవి తేలికగా ఇంట్లోనే చేసుకుని, ఆరగించి ఆనందిద్దాం. ఆ రుచులేంటో తెలుసుకుందాం మరి.
మోదక్‌లు..
కావలసినవి : మామిడిపండ్లు - 2, తురిమిన కోవా - కప్పు, చక్కెర - తగినంత, యాలకుల పొడి- స్పూను, నెయ్యి - స్పూను
తయారీ : మామిడిపండ్లను కడిగి, తోలుతీసి ముక్కలుగా తరిగి గుజ్జుగా మిక్సీ పట్టాలి. కోవాని తురిమి ఒక గిన్నెలో పక్కనుంచాలి. మోదక్ అచ్చులకు కొద్దిగా నెయ్యిరాసి పక్కనుంచాలి. పాన్ వేడి చేసి, కోవాను వేడి చేయాలి. కోవా కరిగిన తర్వాత, చక్కెర కలిపి ఉడికించాలి. చక్కెర కూడా కరిగిన తర్వాత మామిడి గుజ్జును చేర్చి మీడియం ఫ్లేం మీద తిప్పుతూనే చిక్కగా అయ్యేంతవరకు ఉడికించాలి. అందులో యాలకుల పొడి వేసి, మరో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. మోదక్ మిశ్రమం రంగు మారుతుంది. పాన్ అంచుల నుండి విడివడటం మొదలైన వెంటనే స్టవ్ ఆపి, మిశ్రమాన్ని మరొక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న ఉండలుగా చేసి అచ్చులో ఉంచి, నొక్కితే మోదక్ ఆకారం ఏర్పడుతుంది. అంతే మామిడి మోదక్‌లు రెడీ అయినట్లే. హాయిగా సర్వ్ చేసుకోవడమే.
కుల్ఫీ..
కావలసినవి : తరిగిన మామిడిపండు ముక్కలు- కప్పు, పాలు - 1.5 కప్పులు, మిల్క్‌మెయిడ్ -200 గ్రా. పాల మీగడ - కప్, యాలకుల పొడి - టీస్పూన్, కుంకుమపువ్వు - చిటికెడు
తయారీ : మామిడి ముక్కలు, పాలు, మిల్క్‌మెయిడ్‌లను మృదువుగా అయ్యే వరకూ మిక్సీ పట్టాలి. కుల్ఫీ మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్స్‌లో గానీ, చిన్న గిన్నెలలో గానీ పోసి, అల్యూమినియం ఫాయిల్‌తో కవర్ చేయాలి. కుల్ఫీ సెట్ కావడానికి 6 నుండి 8 గంటల వరకు ఫ్రీజర్‌లో ఉంచాలి. చాకుకు నెయ్యి రాసి కుల్ఫీని సున్నితంగా తీయాలి. కుల్పీ అచ్చులను కొన్ని సెకన్లపాటు నీటి కింద ఉంచినా ఈజీగా తీయవచ్చు. కుల్ఫీని ముక్కలు చేసి వాటిపై యాలకుల పొడి, కుంకుమపువ్వు చల్లి, ఉడికించిన సేమ్యా, నానబెట్టిన సబ్జా గింజలను కుల్ఫీ ముక్కలపై చేర్చి, సర్వ్ చేయవచ్చు. మామిడిపండు కుల్ఫీ నెల రోజులు ఫ్రీజ్‌లో నిల్వ ఉంటుంది.
ఫుడ్డింగ్..
కావలసినవి : మీడియం సైజు మామిడిపండ్లు - 2, చక్కెర - 5 స్పూన్లు, చైనా గ్రాస్ - 2 స్పూన్లు, నీరు- కప్పు, కొబ్బరిపాలు - కప్పు
తయారీ : ముందుగా మామిడిపండ్లను కడిగి, పీల్ చేయాలి. ముక్కలు తరిగి చక్కెర కలిపి మెత్తగా మిక్సీ పట్టి, పక్కనుంచాలి. ఒక పాన్లో, చిన్నగా తరిగిన చైనాగ్రాస్‌ను కలుపుతూ కరిగించాలి. దానికి నీటిని కలిపి, మీడియం ఫ్లేం మీద వేడి చేయాలి. గ్రాస్ పూర్తిగా కరిగిన తరువాత మృదువైన జెల్లీ లాంటి పదార్థం ఏర్పడుతుంది. ఆరిన తరువాత ఈ పదార్ధం, కొబ్బరిపాలు మామిడిగుజ్జులో కలిపి, మరల అన్నీ బాగా కలిసేలా మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని గిన్నెలలో పోసి, పైన కొన్ని బెర్రీలు, డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించాలి. మామిడిపండుతో ఫుడ్డింగ్ రెడీ అయినట్లే. దీనిని అల్యూమినియం ఫాయిల్‌తో కవర్ చేసి 4 నుండి 5 గంటలు ఫ్రిజ్‌లో ఉంచి, సర్వ్ చేసుకోవడమే. వేసవిలో హాయిగా, చల్లగా ఉండే ఈ ఫుడ్డింగ్‌ను పిల్లలు ఇష్టంగా తింటారు.