Oct 22,2023 10:29

రామాపురం అనే గ్రామంలో చంద్రయ్య అనే ధనికుడు ఉండేవాడు. ఆయన పక్క ఇంట్లోనే మంగయ్య అనే నాటు వైద్యుడుండేవాడు. అయితే ఎప్పటి నుంచో వారి మధ్య స్నేహం లేదు. కారణం వారి ఇళ్ళ మధ్య వున్న కొద్దిపాటి ఖాళీస్థలం విషయమై వివాదం. చంద్రయ్యకు ఒక్కగానొక్క కొడుకు. వాడికి నాలుగేళ్ళు వచ్చినా మాటలు రాలేదు. గ్రామంలో వున్న గురువుల వద్ద మంగయ్య కొడుకు విద్య పూర్తిచేశాడు. వాడిని దూరంలో వున్న విద్యాలయానికి పంపి, వైద్యశాస్త్రం చదివించాలని మంగయ్య ఆలోచన. తానేదో చిట్కా వైద్యాలతో పల్లెటూర్లో ఇంతకాలం నెట్టుకొచ్చాడు. అలాకాక తనకొడుకు పెద్ద వైద్యుడు కావాలని అతని కోరిక. కానీ అతని దగ్గర దానికి తగ్గ ధనం లేదు.
ఈ విధంగా చంద్రయ్య ఒక దిగులుతో, మంగయ్య మరొక దిగులుతో ప్రశాంతత లేకుండా కాలం గడపసాగారు. మనశ్శాంతి కోసమని రోజూ ఊరికి చివరన వున్న గుడికి ఆ ఇద్దరూ విడివిడిగా వచ్చి, దర్శనం అయ్యాక విశ్రాంతికని గుడి ముందున్న రావి చెట్టు కింద అరుగు మీద కూర్చొనేవారు. అలా కూర్చున్నపుడు అక్కడే కూర్చుని, విశ్రాంతి తీసుకుంటున్న ఒక వృద్ధుడితో వారికి మాటలు కలిసేవి. ఆయన గ్రామస్థులందరితో కలుపుగోలుగా వుంటూ వారి కష్ట నష్టాలను తెలుసుకుంటూ తనకు తోచిన సలహాలు ఇస్తుండేవాడు. ఆ చనువుతో గ్రామస్తులు తమకున్న సమస్యలు ఆ వృద్ధుడితో చెప్పుకుని, కొంత ఊరట పొందేవారు. ఒకసారి అనుకోకుండా చంద్రయ్య 'నాకు కట్టుకపోయేంత ధనం వుంది. కానీ ఏం లాభం? ఉన్నగానొక్క కొడుక్కి మాటలు రావు' అంటూ బాధపడ్డాడు. అలానే మంగయ్య 'పిల్లవాడ్ని చదివించి, పెద్ద వైద్యుడ్ని చేద్దామంటే తగినంత ధనం లేదు.' అన్నాడు. దానికి వృద్ధుడు 'మీ పక్కింటి చంద్రయ్య ధనవంతుడే కదా! ఆయన్ని ఆర్థికసహాయం అడగకూడదా' అన్నాడు. 'వారి కుటుంబంతో మాకు తరతరాల నుంచీ వైరమే. ఇంకొక విషయం ఏమంటే వాళ్ళ అబ్బాయికి మాటలు రప్పించడం నావల్ల అవుతుంది. మనవూరినానుకుని వున్న అడవిలో కుసుమాకరము అనే మొక్క ఒకటి వుంది. దాని వేరు తెచ్చి రాతి మీద సాది, ఆ రసాన్ని ముప్పూటలా ఆ పిల్లవాడి చేత తాగిస్తే మాటలు వచ్చేస్తాయి. ఆ వైద్యం మా గురువు దగ్గర నేర్చుకున్నాను. చంద్రయ్య కుటుంబంతో మాకున్న కలహాల వల్ల ఈ విషయాన్ని నేనెప్పుడూ బయటకు చెప్పలేదు' అన్నాడు మంగయ్య.
ఇద్దరూ గుడికి వచ్చి దైవ సహాయం కోసం తిరుగుతున్నారు. కానీ వారనుకుంటే, వారిద్దరే వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చు అనిపించింది ఆ వృద్ధుడికి. అతి కష్టం మీద ఇద్దరినీ వృద్ధుడు గుడివద్ద కూర్చోబెట్టి.. 'నాకొక ఆలోచన వచ్చింది. నా మాట మీరు కాదనరన్న నమ్మకం వుంది' అంటూ తన మనసులోని మాట చెప్పాడు. అదేమంటే మంగయ్య కొడుకు చదువుకయ్యే ఖర్చు చంద్రయ్య ఋణంగా ఇవ్వాలి. మంగయ్య తనకు తెలిసిన వైద్యంతో చంద్రయ్య కొడుకుకు మాటలు వచ్చేలా చేయాలి'. కష్టాల్లో వున్న ఇద్దరూ దానికి ఒప్పుకున్నారు. మంగయ్య వైద్యంతో చంద్రయ్య కొడుకుకు మాటలు వచ్చాయి. చంద్రయ్య మంగయ్య కొడుకు చదువుకు కావాల్సిన ధనాన్ని ఇచ్చాడు. ఆ విధంగా ఇద్దరి కష్టాలూ తీరాయి.
చంద్రయ్య, మంగయ్యలిద్దరూ ఆనందంగా కుటుంబాలతో గుడికి వచ్చారు. అప్పుడు అక్కడ వున్న వృద్ధుడు వారితో వున్న చనువు కొద్దీ ఇలా అన్నాడు 'కష్టాలు వచ్చినపుడు భగవంతుడ్ని ప్రార్థించడం మానవులకు సహజం. అది తప్పుకాదు. అయితే ప్రతి కష్టానికి దైవాన్ని వేడడం కన్నా.. మానవ ప్రయత్నంతో ముందు మన సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. అంటే వీలున్నంతలో ఒకరి కష్టాన్ని ఇంకొకరు తీర్చే ప్రయత్నం చేయాలి. అన్నింటికీ దేవుడి మీదే భారం వేసి, ఎవరికీ ఎటువంటి సహాయం చేయక, చేతులు ముడుచుకుని వుండడం సరికాదు. అందుకే నాకు తోచిన సలహా మీకిచ్చాను. దాన్ని పాటించి, మీరు మీ మీ సమస్యలను పరిష్కరించుకున్నారు. మీరు పాత తగాదాలను మనసులో వుంచుకోకండి. ఇరుగుపొరుగులన్నాక ఏవో సమస్యలుంటాయి. వాటిని శాశ్వతంగా మనసులో వుంచుకోరాదు. సామరస్యంగా పరిష్కరించుకుని సఖ్యతతో మెలగండి. సాటి వారికి ఉన్నంతలో సహాయపడుతూ వుండండి అదే గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుంది' అన్నాడు. వృద్ధుని మీద వున్న గౌరవంతో వాళ్ళు సరేనన్నారు. తర్వాత కాలంలో వాళ్ళు గొప్ప స్నేహంతో మెలుగుతూ సత్కార్యాలెన్నో చేసి, గ్రామంలో మంచిపేరు పొందారు.
- డా. గంగిశెట్టి శివకుమార్‌
94418 9534