ఒక యువకుడు సత్యాన్వేషణ చేస్తూ, సంచరిస్తున్నాడు. ఒక చోట చెట్టు కింద ఒక బైరాగి కనిపించాడు. ఆయన ముందు కొందరు భక్తులు ధ్యానంలో ఉన్నారు. యువకుడు ఉత్సాహంగా సమీపించి 'స్వామీ! నాకు జ్ఞానాన్ని బోధించండి' అని ప్రార్థించాడు.'
'కాస్త పక్కకి రా! వారికి ధ్యాన భంగమవుతుంది' అన్నాడు బైరాగి. 'సరే!' అని యువకుడు కదిలాడు.
బైరాగి అతడి వైపు ఎగాదిగా చూసి 'నేనెప్పుడూ ఎవరికీ ఏమీ బోధించలేదు' అన్నాడు నిమ్మళంగా. యువకుడికి నమ్మశక్యం కాలేదు. ఉచితంగా చెప్పటానికి మనసొప్పక అలా తప్పించు కుంటున్నాడని భావించాడు. 'గురుదక్షిణ లేకుండా విద్య ఆశించకూడదని నాకూ తెలుసు. నా దగ్గర వంద రూకలు ఉన్నాయి. వాటిని స్వీకరించి, నాకు నేర్పించండి' అన్నాడు వినయంగా.
బైరాగి చిరునవ్వుతో 'నాకే జ్ఞానం గురించి సరిగా తెలియదు. ఇక నీకేం నేర్పను?' అన్నాడు. యువకుడికి కోపం వచ్చినా తమాయించుకున్నాడు.
'వంద రూకలు మీకు చాలకపోతే, ఇంటికి పోయి మరికొన్ని తీసుకొస్తాను' అన్నాడు. బైరాగి శాంతంగా చూసి 'నిజంగా నాకేమీ తెలియదు నాయనా!' అన్నాడు. యువకుడికి సహనం నశించింది. 'మరి వీరికేమి చెపుతున్నారు?' ఆవేశపడ్డాడు. బైరాగి నిదానంగా 'వీరికి కూడా నేనేమీ చెప్పటం లేదు నాయనా!' అన్నాడు.
'ఏమీ చెప్పని వాడి దగ్గర ఇంతమంది ఎందుకున్నారు?' విసుక్కున్నాడు యువకుడు.
'నాకేమీ తెలియదని అర్థమైననాడు నన్ను విడిచిపోతారు!' అన్నాడు బైరాగి మృదువుగా.
యువకుడికి వ్యర్థ వాదనతో సమయం వృథా అయిందని అర్థమైంది. అతడు 'కపట బైరాగి' అని నిశ్చయించి, వేరేచోట ప్రయత్నించాలని వెనుదిరిగాడు. అంతలో బైరాగి 'ఒక్క క్షణం ఆగు నాయనా!' అన్నాడు. యువకుడు తల తిప్పి నిరాసక్తంగా చూశాడు.
'చిన్న సలహా మాత్రం ఇవ్వగలను. సత్యాన్వేషణ, జ్ఞానబోధ అంగడి సరుకులు కావు. అవి బయట దొరకవు. వాటిని సాధించాలనే వెంపర్లాటలో దేశ సంచారిగా మారి, జీవితం నాశనం చేసుకోకు' అన్నాడు.
యువకుడికి ఏదో బోధపడినట్లు అనిపించింది.
బైరాగి మళ్ళీ 'ఎవరూ ఏమీ నీకు చెప్పలేరు. అవి నీలోనే ఉన్నాయి. నీ అంతర్మథనానికి వేరొకరి సమాధానం అసంబద్ధం. ఇతర్ల జోక్యం అర్ధరహితం. మనసు వంగితే సమస్య తెలుస్తుంది. శరీరం వంచితే పరిష్కారం లభిస్తుంది' అన్నాడు. ఆ మరుక్షణం యువకుడు బైరాగి పాదాలపై వాలిపోయాడు.
- కౌలూరి ప్రసాదరావు
93467 00089