Oct 29,2023 10:06

ఇరుగుపొరుగు రాజ్యాలుగా అవంతీపురం, పార్వతీపురం ఉండేవి. ఇద్దరు రాజుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండే శత్రుత్వముండేది. ఇద్దరు రాజులకు ఒకే రోజున కొడుకులు పుట్టారు. ఆ పిల్లలకు చదువుకొనే వయస్సు వచ్చింది. ఇద్దరు రాజులు మంచి విద్యాబుద్ధులు నేర్పించాలనుకున్నారు. వారిని నలంద రాజ్యంలో ఉన్న విశ్వబ్రహ్మ గురుకులంలో చేర్పించారు.
సమానత్వ ధోరణి ఉన్న విశ్వబ్రహ్మ ఆధ్వర్యంలో ఇద్దరు రాకుమారులు స్నేహితులయ్యారు. ఈ విషయం విన్న ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. మిత్రులిద్దరూ అన్నింటా చేదోడువాదోడుగా ఉంటూ సహకార భావంతో మెలిగేవారు. జీవితాంతం చెలిమిని విడువక ఒకరికొకరంగా ఉందామనుకున్నారు. కొన్నేళ్లయ్యాక ఇద్దరి విద్యాభ్యాసం పూర్తయ్యింది. ఎవరి రాజ్యాలకు వాళ్ళు వెళ్ళిపోయారు.
ఇప్పుడు అందరి దృష్టి ఆ రెండు రాజ్యాలపై పడింది. రెండు రాజ్యాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంటుందని ప్రజలు ఆశించారు. దుండగులు అప్రమత్తం అవుతారని, రెండు రాజ్యాల మధ్య వైరం కొనసాగించారు మిత్రులు.
పార్వతీపురం రాజ్యంలో వజ్రాల వర్తకుడు కొత్తగా వచ్చాడు. విలువైన వజ్రాలు అమ్మకంలో అందెవేసిన చేయిగా కొద్దికాలంలోనే పేరొందాడు. వేగుల ద్వారా ఈ విషయం తెలిసిన పార్వతీపురం రాజు ఆ వజ్రాల వర్తకుడు పొరుగుదేశం గుఢాచారి అని అనుమానించాడు. వజ్రాలు కొనే నెపంతో వజ్రాల వర్తకుడ్ని పిలిపించుకున్నాడు. విలువైన వజ్రాలను చూపించమని అడిగాడు
'ప్రభూ! నేను తెచ్చిన వజ్రాలు అమ్మకం అయిపోయాయి. మీరు అనుమతిస్తే వారం రోజుల్లో మీ అభిరుచికి తగ్గట్టుగా మంచి వజ్రాలను తీసుకురాగలను' అని వినయంగా చెప్పాడు వజ్రాల వర్తకుడు.
రాజుగారికి వజ్రాల వర్తకుడిపై అనుమానం బలపడింది. 'శత్రు దేశం పంపిన గుఢాచారివే గదా?' గద్దించి అడిగాడు.'కాదు' అని సమాధానమిచ్చాడు వజ్రాల వ్యాపారి.
'నేను నమ్మను. నీపై నిఘా బృందాన్ని ఏర్పాటు చేశాను. దానికి నా కుమారుడు నాయకుడు. ఆ నివేదిక వచ్చాకే నిజానిజాలు తెలుసుకొని, నిన్ను విడుదల చేస్తాను. అంతవరకు నువ్వు మా బందీవి' అంటూ భటులను పిలిచి, వజ్రాల వర్తకుడుని ఖైదు చేయించాడు. ఆ తరువాత, కొడుకును పిలిపించి విషయం వివరించాడు.
భటులను బయట ఉంచి నేరుగా ఖైదీ గదిలోకి ప్రవేశించాడు రాకుమారుడు. విచారణలో భాగంగా ఖైదీని కలిశాడు. కొద్దిసేపు గడిచాక తండ్రి వద్దకు వెళ్ళి, వజ్రాల వర్తకుడు శత్రుదేశం పంపిన గుఢాచారి కాదని విచారణలో తేలింది. అతని దగ్గర విలువైన సమాచారం దొరికిందనే విషయాన్ని కూలంకషంగా చెప్పాడు.
విలువైన సమాచారమేమిటి? ఆతృతగా అడిగాడు. మన రాజ్యంలో లంచాలు మేస్తున్న అధికారులు తాము దాచుకున్న డబ్బును ఎవరి కంటా పడకుండా ఉండేందుకు.. వజ్రాల రూపంలో వాటిని మార్చుకుంటున్న వైనం ఈ వజ్రాల వ్యాపారి ద్వారా తెలిసింది. వజ్రాలు కొనే వారి చిరునామాలు తీసుకున్నానని చెప్పాడు రాకుమారుడు.
మంచి సమాచారమిచ్చినా, అతడు శత్రుదేశపు పౌరుడనే అనుమానం నాకు ఉంది. మంచిగా నటిస్తూ మనల్ని ముంచే పని చేస్తున్నాడన్న సందేహం కలుగుతుందని కొడుకుతో చెప్పాడు పార్వతీపురం రాజు.
'మీ అనుమానం నిజమే కానీ మీ సందేహం మాత్రం తప్పు. ఆ వజ్రాల వర్తకుడు నా బాల్య మిత్రుడు, అవంతీపురం రాకుమారుడు. అభివృద్ధి కోసం మీరు కేటాయిస్తున్న నిధులు దారి మళ్ళుతున్న విషయం నా మిత్రుడు దగ్గర ప్రస్తావిస్తే ఈ సాయం చేశాడు. ఇక వారిపై దాడులు నిర్వహిస్తే పరిస్థితి అదుపులోకి వస్తుంది' అని తండ్రికి వివరణ ఇచ్చాడు.
'శత్రువు మనకు సాయం చేయడమంటే అది నమ్మదగ్గ విషయం కాదు. ఇందులో ఏదో ప్రలోభ దాగి ఉంది' అని సందేహం వ్యక్తం చేశాడు రాజు.
మీ తరం నుండి రెండు రాజ్యాల మధ్య శత్రుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది. అందుకే దేశంలో దొంగలు పడ్డారు. వారు శత్రువులకన్నా ప్రమాదకరం. ఇది రెండు రాజ్యాల్లో అంతర్గత సమస్యగా మిగిలింది. మా తరం కొత్తగా ఆలోచించాం. ఇరుగు, పొరుగు రాజ్యాలతో స్నేహంతో సమస్యలను చక్కదిద్దుకోవాలనుకున్నాం. రేపటి నుండి ఆ రాజ్యంలో వజ్రాల వర్తకుడు వేషం నాదే' వివరించాడు రాకుమారుడు. బంధించిన మిత్రుడ్ని నిర్దోషిగా విడిచిపెట్టాడు రాకుమారుడు.
'శత్రుత్వం ప్రజల అప్రమత్తం కోసం, మిత్రత్వం ప్రజల సంక్షేమం కోసం!' అంటూ కొడుకుని మెచ్చుకున్నాడు పార్వతీపురం రాజు.
- బి.వి. పట్నాయక్‌
83098 72913