కొన్నేళ్ల క్రితం అలా
రాత్రి వెన్నెల్ని మోసి
అలసిపోయాను
ఎడ్ల బండి గంతుల్ని చూసి
మురిసిపోయాను
గత్తం పొలంలో
చుక్కలుగా ఎగిరింది..
తెల్లవారింది
దుక్కిదున్నటంలో
మునిగిపోయాను
నాగలి అడుగుల్తో
కదిలిపోయాను
ఈ నాగలి రైతు ప్రపంచానికి
ప్రపంచపు ఆకలిని
ఎత్తిచూపింది..
దృశ్యం మారింది
చిన్నప్పటి నాగళ్లు
కాల బంధనంలో ఇరుక్కుని
ట్రాక్టర్లుగా రూపాంతరం చెందాయి
అయినా కాసింత మార్పే అనుకున్నా
ఇప్పుడు అదే మట్టి
స్థలాల ముక్కలుగానో..
కర్మాగారాలుగానో..
మనిషిని నమిలే
కారాగారంలానో
మట్టి యంత్రాలతో
పరాయిదైంది..
ఇప్పుడు ఇక్కడే
పని కోసం పోరాడుతున్నారు..
ఉపాధి కోసం
ఉప్పెనలా చూస్తున్నారు
చినిగిన కలల్ని మోసుకుని
వెట్టిచాకిరి బాటలో
మగ్గిపోవాలని చూస్తున్నారు
రైతు రాజు కావాలి..
బానిస కాదు కదా..
అర్థం కాని అంకంలో
కిటకిటలాడుతూ
భూమిని సమర్పించిన
రైతుల ప్రాణాలు
దిక్కులు చూస్తున్నాయి
- గవిడి శ్రీనివాస్, 70192 78368