May 14,2023 13:27

'విరిగిపోయిన ఈ బక్కెట్టు తీసుకెళ్లి పాత సామాన్లవాడికి ఇచ్చెరు నానా' అంది అమ్మ రవికి ప్లాస్టిక్‌ బకెట్‌ అందిస్తూ. తొమ్మిదో తరగతి చదివే రవిలో తెలివి, సృజనాత్మకత ఎక్కువ. ఆకుపచ్చ రంగున్న బకెట్‌ మీద రంగు రంగుల పువ్వులున్నాయి. విరిగినా సరే అందంగా ఉంది. దాన్ని పాత సామాన్లవాడికి ఇవ్వడం రవికి నచ్చలేదు. కాసేపు ఆలోచించగా వాడికో ఆలోచన వచ్చింది. ఒక కత్తెర తీసుకుని బకెట్‌ అంచు నుండి విరిగిన భాగం వరకు క్రమపద్ధతిలో కత్తిరించి తొలగించాడు. అడుగున ఒక రంధ్రం చేసి, మట్టితో నింపి గులాబీ మొక్క ఒకటి పెట్టాడు. దాన్ని ప్రహరీ గేటు పక్కన పెట్టేసి అమ్మకి చూపించాడు.
'ఇదెక్కడిది?' అని ఆశ్చర్యపోయింది అమ్మ. జరిగింది అమ్మకి చెప్పాడు రవి.
వాడి ఆలోచనను మెచ్చుకుని, వాళ్ళ నాన్నతో చెప్పింది.
'చదువుకోవాల్సిన సమయాన్ని ఇలా వృధా చేయకుండా చదువుకోమను' అన్నాడు నాన్న.
మరొకరోజు వీధిలో అందరికీ కరెంట్‌ పోయింది. రవి గదిలో మాత్రం కరెంట్‌ వెలుగు కనబడింది. వీధిలో వాళ్లకు రవి వాళ్లింట్లో మాత్రం వెలుగు కనబడడం ఆశ్చర్యమేసి, 'మీకు కరెంట్‌ పోలేదా? లేకపోతే ఇన్‌వర్టరా?' అని అడిగారు.
'మాకూ కరెంట్‌ పోయింది. ఇన్‌వర్టర్‌ లేదే..!' అంటూ ఆశ్చర్యంగా గది దగ్గరకి వెళ్తే చదువుకుంటూ కనబడ్డాడు రవి.
'ఇదెలా సాధ్యం?' అని అడిగారు రవిని.
'పనిచెయ్యని కారు బ్యాటరీలను ఒక అంకుల్‌ పారెయ్యబోతుంటే అడిగి తీసుకున్నాను. మనింట్లో కరెంట్‌ రిపేరు చేసినప్పుడు మిగిలిన రాగివైర్లు దాచాను. ఆ పాత బ్యాటరీలో మెగ్నీషియం సల్ఫేట్‌ (ఎప్సమ్‌ సాల్ట్‌), కాస్టిక్‌ సోడా, పరిశ్రమల్లో ఉపయోగించే స్ఫటికాకార ఆమ్లం ఉపయోగించి, ఛార్జింగ్‌ చేశాను' అన్నాడు రవి. వీధిలో వాళ్లంతా రవి తెలివిని అభినందించి, వెళ్ళిపోయారు. నాన్న మాత్రం ఇలా సమయం వృధా చేస్తున్నాడని గొణుక్కున్నాడు.
ఒకరోజు సాయంత్రం బడి నుండి వచ్చిన రవితో 'దోమతెర చినిగిపోయిందని, కొత్త దోమతెర కట్టడానికి సాయం రమ్మని' పిలిచింది వాళ్ళమ్మ. పాత దోమతెరలో కొన్నిచోట్ల రంధ్రాలు పెద్దవయ్యాయి. పనయ్యాక పాత తెరని బయట పడెయ్యమంది. దాన్ని చూసిన రవి 'పారేయడం కంటే వడియాలు, పిండి, పప్పులు ఆరబోసినప్పుడు పక్షులు వాలకుండా వల లాగా వాడొచ్చమ్మా!' అన్నాడు. వాళ్ళమ్మ భలే ఆలోచన అంటూ మెచ్చుకుంది.
సరిగా అప్పుడే వాళ్ళ నాన్న ఇంట్లోకి వస్తూ ఆ మాటల్ని విన్నాడు. 'అదేపనిగా మెచ్చుకుని వాడిని పాడు చెయ్యకు' అని కసిరాడు. రవి మీద వాళ్ళ నాన్నకి ప్రేమ లేక కాదు. ఇలాంటి పనులతో చదువుకి ఆటంకం రాకూడదని భయపడుతుంటాడు. తరగతి పుస్తకాలు చదవాలి తప్ప, ఇలాంటి పనులు చేయొద్దంటాడు. ఏదైనా కొత్తగా ఆలోచించి రవి చెప్పగానే వాటిని మొగ్గలోనే తుంచి పారేసేవాడాయన. కొడుకుని ప్రోత్సహించాలని ఉన్నప్పటికీ భర్తకి ఎదురు చెప్పలేకపోయేది వాళ్ళమ్మ.
ఒకరోజు ఉదయం కూరగాయల కోసం వెళ్లిన రవినాన్నకి సైన్సు మాస్టారు కనిపించారు. కాసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. రవి తెలివిని, సృజనాత్మకతని మెచ్చుకున్నారు మాస్టారు. రవి నాన్న సంతోషించలేదు సరికదా 'నాకూ అదే భయం. వేరే ఆలోచనల్లో పడిపోయి, చదువుని నిర్లక్ష్యం చేస్తాడేమోనని' అన్నాడు.
'అందులో భయపడాల్సిందేముంది? వాళ్లకొచ్చే ఆలోచనలను స్వాగతించాలి. రవిలా సృజనాత్మకత ఉన్నవాళ్లు మాత్రమే దేన్నైనా కొత్తకోణంలో చూస్తారు. బడిలో పిల్లలకు వచ్చే కొత్త ఆలోచనలను మేం స్వాగతిస్తుంటాం. వాటిని నూతన ఆవిష్కరణలుగా విజ్ఞాన ప్రదర్శనలప్పుడు ప్రదర్శిస్తుంటాం' అన్నారు మాష్టారు.
రవి ఇంట్లో చేసిన పనుల గురించి మాష్టారికి చెప్పి 'వీటివల్ల ఏం ప్రయోజనం ఉంది?' అనడిగాడు రవి నాన్న మాష్టారుని.
'ఎన్నో ఏళ్ళు పిండివిసిరిన తిరగలి అరిగిపోతే కొందరు పారేస్తారు. మరికొందరు గార్డెన్లో మెట్టుగా వాడతారు. టీ కప్పు పగిలితే కొందరు పారేస్తారు. మరికొందరు బడ్‌వేజ్‌గా వాడతారు. ఇందులో డబ్బు ఎంత మిగిలిందన్నది ప్రశ్న కాదు. కొత్త రూపంలో పాత వస్తువుని చూసినప్పుడు కలిగే మానసిక ఆనందం వేరు. అందులో ఉన్న కొత్తకోణాన్ని. సృజనాత్మకతను చూస్తే ఆ పని ఎంతో గొప్పదని తప్పక అర్థమవుతుంది. రవిలో చురుకైన బుద్ధి ఉంది. తెలివిగా, వేగంగా ఆలోచిస్తాడు. అందువల్ల చదువులో కూడా ముందుంటాడు' అన్నారు.
రవి నాన్నకి అంతవరకూ ఉన్న అపోహలన్నీ తన అనుమానాలేనని అర్థమయ్యాయి. ఆ రోజు నుంచి రవిని చదువుకే పరిమితం కావాలని అనకుండా మిగతా విషయాల్లో కూడా ప్రోత్సహించాడు. తన మీద అమ్మానాన్నలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు రవి.

నారంశెట్టి ఉమామహేశ్వరరావు
9490799203