
ప్రపంచ వ్యాప్తంగా పట్టి పీడిస్తున్న సమస్య పాము కాటు. ఉష్ణమండల దేశాలు, తేమ ఎక్కువగా వున్న దేశాలు, ఉప- ఉష్ణమండల దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా వున్నా...పెద్దగా పట్టించుకోవడం లేదని నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఓ) నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 54 లక్షల మంది పాముకాటుకు గురవుతున్నారు. వీరిలో చాలా మంది పాము విష ప్రభావానికి గురవుతున్నారు. వీరిలో అత్యధికులు రకరకాల తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్నారు. సుమారు 20 లక్షల మంది ఆసియా ప్రాంతంలో ప్రాణాలు కోల్పోతున్నారు. అకాల మరణంతో కుటుంబ సభ్యులకు తీవ్ర దు:ఖం కలగచేస్తున్నారు.
ఇక, మన దేశంలో ఏటా కొన్ని వేల మంది పాముకాటుకు గురై, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో వివిధ అనారోగ్యాలకు గురవుతున్నారు. ''యాక్సిడెంటల్ డెత్స్ అండ్ ఫారమ్ సూసైడ్స్ ఇన్ ఇండియా'' నివేదిక ప్రకారం మనదేశంలో 2021లో 10,450 మంది పాముకాటుకు గురైనారు. వీరిలో 10,382 మంది మరణించగా, 64 మంది గాయాలు పాలైనారు. ఈ మరణించిన వారిలో పురుషులు 6432, మహిళలు 3950. అత్యధిక మరణాలు మధ్యప్రదేశ్‌లో (2732) సంభవించగా, రెండవ స్థానంలో ఒడిషా (1019), తర్వాతి స్థానాలలో ఛత్తీస్‌గఢ్ (909), ఉత్తరప్రదేశ్ (844) నిలిచాయి.
'ట్రెండ్స్ ఇన్ స్నేక్ డెత్స్ ఇండియా' నివేదిక ప్రకారం 2000 నుండి 2019 మధ్యలో 28 లక్షల పాముకాటు కేసులు నమోదయ్యాయి. వీరిలో 12 లక్షల మంది మృతి చెందారు. సగటున ప్రతీ ఏటా 58,000 మంది పాముకాటుకు బలవుతున్నారు. వీటిలో 94 శాతం శాతం మరణాలు గ్రామీణ ప్రాంతాల్లో సంభవిస్తున్నాయి. మరీ ముఖ్యంగా 8 రాష్ట్రాల్లో (బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిషా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్) 70 శాతం మరణాలు నమోదయ్యాయి. వర్షాకాలంలో ఈ సంఘటనలు ఎక్కువగా ఉంటున్నాయి. ఉష్ణ మండలాలు, తేమగా ఉన్న ప్రాంతంలో, వ్యవసాయం/అటవీ ప్రాంతంలో పాముకాటుకు ఎక్కువగా గురవుతున్నారు. దీనికి కారణం ఎక్కువ విషపూరితమైన పాములు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. మన దేశంలో విషపూరితమైన పాములు ఎక్కువగా లేవు. కానీ, ది ఇండియన్ కోబ్రా, ది కామన్ క్రెయిట్, రస్సెల్స్ వైపర్, సా స్కేల్డ్ వైపర్ వంటి పాములు అత్యంత విషపూరితమైనవి. గ్రామీణ ప్రాంత పేద ప్రజలు పాముకాటుకు ఎక్కువగా గురవుతున్నారు. వ్యవసాయ పనులు చేస్తూ, ప్రయాణంలో, కొన్ని సందర్భాల్లో రాత్రి నిద్రించే సమయంలో పాము కాట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. రవాణా సౌకర్యాలు, వైద్య సదుపాయాలు సరిగ్గా లేకపోవడంతో మరణాలు సంఖ్య అధికంగా ఉంటుంది.
పాము కాటు మరణాలకు ముఖ్యంగా రెండు ప్రధాన కారణాలు. ఒకటి యాంటీ-వీనమ్ మందు (ఇంజక్షన్) అందుబాటులో లేకపోవడం. సకాలంలో వైద్య సహాయం అందక పోవడం. అనగా వైద్యం అందటంలో జాప్యం జరగడం. రెండు. నేటికీ అనేక మంది మంత్రగాళ్ళను నమ్మటం. సాంప్రదాయక వైద్యాన్ని ఆశ్రయించడం. వాస్తవం చెప్పాలంటే, పాముకాటు మరణాలు ఇంకా ఎక్కువగానే ఉంటాయని తెలుస్తున్నది. సరైన గణాంకాలు ప్రభుత్వాలకు చేరటంలేదు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో 'యాంటీ వీనమ్' మందు అందుబాటులో ఉంచాలి. వైద్య సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు పాముకాటుపై అవగాహన కల్పించాలి. మీడియా, స్వచ్ఛంద సంస్థలు, విద్యావంతులు అవగాహనా సదస్సులు, ర్యాలీలు, ప్రమాదం సంభవించిన సందర్భంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రాథమిక చికిత్స వంటి అంశాలను ప్రజలకు వివరించాలి. ప్రభుత్వాలు కూడా తగినన్ని నిధులు, యాంటీ వీనమ్ మందు సమకూర్చాలి. ముఖ్యంగా గ్రామీణ వైద్య సేవలు బలోపేతం చేయాలి.
ఉష్ణమండల దేశాలు పాము కాటు మరణాలు, సమస్యలను ఉపేక్షిస్తున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ 2017 లోనే తెలిపింది. దీనిని దృష్టిలో ఉంచుకుని, 2030 నాటికి పాముకాటు మరణాలు కనీసం సగానికి తగ్గించాలని నిర్ణయించారు. మన దేశంలో ''ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చి' 2020 లోనే ''నేషనల్ టాస్క్‌ఫోర్స్''ను ఏర్పాటు చేసింది. ఇది పాము కాటు నివారణకు సంబంధించి సమగ్ర విశ్లేషణ చేస్తుంది. ఇది వైద్య సదుపాయాలు పెంచడానికి, మెరుగు పరచడానికి ప్రణాళిక రూపొందిస్తున్నది. ప్రభుత్వాలు దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగాలి. 2015లో ఒడిషా ప్రభుత్వం పాముకాటు వలన మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల ఆర్థిక సహాయం ఎక్స్‌గ్రేషియాగా అందిస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా వివిధ రకాల పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించి చేతులు దులుపుకుంటున్నారు. ఈ ఆర్థిక సహాయంతో సమస్య పరిష్కారం కాదనే విషయం గ్రహించాలి. ముఖ్యంగా వైద్య సదుపాయాలు, యాంటీ వీనమ్ మందు, వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, అంబులెన్స్ సౌకర్యాలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో అందుబాటులో ఉంచటం ద్వారా ఈ పాముకాటు మరణాలను నివారించవచ్చు.
- రావుశ్రీ,
సెల్ : 6305682733